సిటీబ్యూరో ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ)/బేగంపేట : రాజకీయ జీవితంలో కొన్ని నిర్ణయాలు పదవుల కంటే గొప్పవని, కాలం గడిచినా చరిత్రలో నిలిచిపోతాయని సనత్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సనత్నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రావడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే సనత్నగర్ టిమ్స్ నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేశామని, నేడు ఆ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రావడంతో సనత్నగర్ శాసనసభ్యుడిగా తనకు ఎంతో ఆనందాన్ని, భావోద్వేగాన్ని కలిగిస్తోందని తలసాని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మార్క్ పాలనకు టీమ్స్ నిదర్శనమని చెప్పారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్లో భాగస్వామి కావడం తన అదృష్టమన్నారు. హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా అత్యాధునిక వైద్య సదుపాయాలతో భారీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించి, పేద మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని విప్లవాత్మకంగా విస్తరించిందని తెలిపారు. సనత్నగర్ టిమ్స్ ప్రారంభం కావడం తెలంగాణ ప్రజారోగ్య రంగంలో మరో కీలక మైలురాయి అని అభివర్ణిస్తూ హైదరాబాద్, సనత్నగర్ ప్రజలకు బీఆర్ఎస్ తరపున తలసాని శుభాకాంక్షలు తెలియజేశారు.