హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గత మూడేండ్లలో 9,102 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వెల్లడించారు. వీటిలో కేవలం 32 కేసుల్లోనే ఇప్పటివరకు శిక్షలు పడ్డాయని తెలిపారు. కమిషన్ నివేదికను వెంకటయ్య గురువారం విడుదల చేశారు. అనంతరం కమిషన్ సభ్యులు కుశ్రం నీలాదేవి, రాంబాబునాయక్, లక్ష్మీనారాయణ, రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్‌తో కలిసి నివేదికలోని అంశాలపై మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా గత మూడేండ్లలో భూమి, వేధింపులు, ఉద్యోగ సర్వీస్ తదితర సమస్యలకు సంబంధించి 5,867 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదే కాలంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 9,102 నమోదయ్యాయని, వాటిలో 213 హత్య కేసులుకాగా, బాలికలు, మహిళలపై 1,305 లైంగికదాడి కేసులున్నాయని వెల్లడించారు. వీటిలో కేవలం 32 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయని వెల్లడించారు. కమిషన్ సైతం క్రమం తప్పకుండా జిల్లాల్లో పర్యటిస్తూ కేసుల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షలు నిర్వహించిందని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై కూడా ప్రత్యేకంగా దృష్టిసారించామని చెప్పారు.