సిద్దిపేట, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో రైతులకు సరిపడా విద్యుత్తు సరఫరా చేయలేని పరిస్థితి ఉంటే.. సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న 800 మెగావాట్ల విద్యుత్తును రాజస్థాన్‌కు విక్రయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ప్రశ్నించారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పాలమాకుల, అకనపల్లి, అంక్షాపూర్ గ్రామాల్లో పర్యటించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం నర్మెట సబ్‌స్టేషన్‌ను సందర్శించి అకడి విద్యుత్తు సరఫరా పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎదురొంటున్న విద్యుత్తు సమస్యలపై హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించకుండా పక రాష్ట్రానికి విద్యుత్తు ఎందుకు విక్రయిస్తున్నారని నిలదీశారు. రైతులకు 24 గంటల విద్యుత్తు ఇస్తామని చెప్పి.. కేవలం తొమ్మిది గంటలే ఇస్తున్నారని, అందులోనూ మధ్య మధ్యలో ట్రిప్ అవుతున్నట్టు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వంలో 100 కేవీఏ, 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను రోలింగ్ స్టాక్‌లో అందుబాటులో ఉంచేవాళ్లమని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే వెంటనే పాతదాన్ని తొలగించి కొత్తదాన్ని ఏర్పాటు చేసేవాళ్లమని చెప్పారు. ప్రస్తుతం కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను తీసుకెళ్లి రిపేర్ చేసే వరకు రైతులు మూడు రోజులపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. అంక్షాపూర్‌లో ఓ యువ రైతు తన ఎనిమిది ఎకరాల పొలం కరెంట్ లేక ఎండిపోతున్నదని ఎంతో బాధతో తన దృష్టికి తీసుకొచ్చాడని తెలిపారు. పాలమాకులలో మూడు రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా ఇప్పటికీ కొత్తది ఇవ్వలేదని, కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోయారని చెప్పారు.
ఒక మండలంలోనే 41 ట్రాన్స్ఫార్మర్లు
సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలంలోనే ఈ వారం రోజుల్లో 41 ట్రాన్స్ఫార్మర్లు, 100 నుంచి 200 వరకు మోటర్లు కాలిపోయాయని హరీశ్‌రావు తెలిపారు. దీనికి ప్రధాన కారణం లోవోల్టేజీ సమస్యేనని పేర్కొన్నారు. నర్మెట సబ్‌స్టేషన్‌లో పరిశీలించిన సమయంలో 11 కేవీ లైన్‌పై ఉండాల్సిన వోల్టేజీ స్థాయి కంటే తకువగా వోల్టేజీ నమోదైందని, 11.5 వోల్ట్స్ ఉండాల్సిన చోట కేవలం 10.5 వోల్ట్స్ మాత్రమే ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. లోవోల్టేజీ సమస్య లేకుండా రోజుకు కనీసం 20 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించాలని డిమాండ్ చేశారు.