హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): దక్షిణ భారతదేశంలోనే రెండో అతి పెద్దదైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)ను రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రైవేటీకరించింది. నాలుగువేల మెగావాట్ల ఈ ప్లాంట్‌ను పవర్‌మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీకి కట్టబెట్టింది. మూడేండ్లకుగాను రూ.279.20 కోట్లకు టెండర్లు ఖరారు చేసింది. ఈ మేరకు జెన్కో యాజమాన్యం ఇటీవలే లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ)ను జారీచేసింది. ఈ ప్లాంట్‌లోని కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను పవర్‌మెక్ కంపెనీకి అప్పగించింది.
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) పనుల కాంట్రాక్ట్‌ను సైతం పవర్‌మెక్ కంపెనీయే దక్కించుకుంది. మూడేండ్లపాటు ఈ ప్లాంట్‌ను పవర్‌మెక్ కంపెనీ నిర్వహించనుంది. ప్లాంట్ పర్యవేక్షణ బాధ్యతలను కూడా కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థనే చూడాలి. దీంతో జెన్కో ఇంజినీర్లు ఇక పక్కకు జరగాల్సిందే. ప్రభుత్వ ప్లాంట్ నిర్వహణ మొత్తాన్ని ప్రైవేట్‌పరం చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జెన్కో ఉద్యోగులుండగా, అతి ముఖ్యమైన పనుల నిర్వహణను ప్రైవేట్‌సంస్థకు అప్పగించడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ సంస్థల బలోపేతం అంటే ఇదేనా.. అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
అత్యంత గోప్యంగా
పవర్‌మెక్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టిన విషయాన్ని జెన్కో అత్యంత గోప్యంగా ఉంచింది. నిజానికి సెప్టెంబర్ 26వ తేదీనే ఎల్వోఐ జారీచేశారు. ఐదు రోజులు గడిచిన తర్వాత టెండర్లు కట్టబెట్టిన విషయం బయటికి పొక్కింది. అంతా పారదర్శకంగా జరిగితే ఇంత గోప్యత ఎందుకు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైటీపీఎస్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు యూనిట్లున్నాయి. స్టేజ్-1లోని యూనిట్-1, యూనిట్-2, స్టేజ్-2లోని యూనిట్-3, యూనిట్-4లు మాత్రమే నడుస్తున్నాయి. ఇదే స్టేజ్‌లోని యూనిట్ -5 కమర్షియల్ ఆపరేషన్స్ ఇంకా ప్రారంభంకాలేదు. కానీ ఐదు యూనిట్ల కాంట్రాక్ట్‌ను పవర్‌మెక్ కంపెనీకి అప్పగించారు. యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఆపరేషన్, మెయింటెనెన్స్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్వహణను కూడా ఇదే కాంట్రాక్ట్ సంస్థ చేపట్టాల్సి ఉంటుంది. మెకానికల్, ఎలక్ట్రికల్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల ఆపరేషన్, నిర్వహణ పనులను సైతం ప్రైవేటీకరించారు.
ఏడాది తర్వాత మోతే
ఎల్వోఐ ప్రకారం ప్రాథమిక ధర రూ. 279,20,37,600లుగా జెన్కో ఖరారు చేసింది. ఇది మొదటి ఏడాదికే. రెండు, మూడో ఏడాదికి ప్రైస్ వేరియేషన్ క్లాజ్ (పీవీసీ) వర్తిస్తుందని ఎల్‌వోఐలో పేర్కొన్నారు. అంటే రెండో, మూడో ఏడాది ధరలు మారిపోతాయి. ఏడాది తర్వాత ఇది రూ.300-350 కోట్లకు చేరుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్య క్తంచేస్తున్నాయి. జెన్కోపై అదనపు భారం పడుతుందని వాదిస్తున్నాయి. భవిష్యత్తులో కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఈ నిబంధన పెట్టారని ఆరోపిస్తున్నారు. అలాంటప్పుడు ఒకేసారి మూ డేండ్లకు ఎందుకు టెండర్లు పిలిచారని ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకునే ప్రైస్ వేరియేషన్ క్లాజు పెట్టినట్టు జెన్కో వర్గాలంటున్నా యి.
జేఏసీ నేతలకు హామీనిచ్చి..
వైటీపీఎస్ ప్రైవేటీకరణను పవర్ ఎంప్లాయిస్ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కొద్దిరోజులపాటు రాష్ట్రమంతటా జేఏసీ ఆందోళనలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23న జేఏసీ నేతలతో విద్యుత్తు సంస్థల సీఎండీలు చర్చలు జరిపారు. ఈ ప్లాంట్‌లో షిఫ్ట్‌ల వారీగా పర్యవేక్షణ బాధ్యతలను జెన్కో ఇంజినీర్లే చేపట్టాలని జేఏసీ నేతలు పట్టుబట్టారు. దీనిపై యాజమాన్యం స్పష్టమైన హామీనిచ్చింది. కానీ మూడు రోజులకే మాట మార్చింది. ఇంజినీర్ల పర్యవేక్షణ బాధ్యతలను కూడా కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థకే కట్టబెట్టింది. ఈ ప్లాంట్లలో ఇంజినీరింగ్ విభాగంలో 151 మంది అవసరముండగా, 77 మంది ఇప్పటికే పనిచేస్తున్నారు.ఇప్పటికే వైటీపీఎస్ ప్లాంట్‌లో అనేక సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మూడురోజుల క్రితం ఉన్న నాలుగింటిలో మూడు యూనిట్లు షట్‌డౌన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పర్యవేక్షణ బాధ్యతలను ప్రైవేట్‌కు అప్పగించడమంటే ప్లాంట్‌ను నిర్వీర్యం చేయడమే అవుతుందని జేఏసీ నేతలు ఆందోళన వ్య క్తంచేస్తున్నారు. త్వరలో తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని నేతలు వెల్లడించారు.
అంచనాల పెంపు
యాదాద్రి పవర్‌ప్లాంట్‌లోని యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు జెన్కో టెండర్లు ఆహ్వానించింది. ఇందుకు అంచనా వ్యయంగా రూ.255 కోట్లు ఖరారు చేశారు. కొంతకాలం క్రితం ఇదే పనులకు ఆరు మాసాలకు రూ.34.50 కోట్లు అవుతుందని అంచనావేశారు. ఈ లెక్కన మూడేండ్లకు రూ.207 కోట్లు మాత్రమే అవుతుంది. కానీ ఏకంగా రూ.255 కోట్లకు టెండర్లు ఆహ్వానించారు. మొదట ప్రతిపాదించిన దానికంటే రూ.48 కోట్ల అంచనాలు పెరిగాయి.
సిబ్బంది, కార్మికుల సంఖ్యను ఎక్కువగా చూపించి అంచనాలను భారీగా పెంచారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 1,650 మంది మాత్రమే అవసరం. కానీ కాంట్రాక్ట్ సంస్థకు మేలు చేసేందుకు 1,913 మందికి పెంచారు. ఇప్పటికే 1,254 మంది ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. కేవలం 396 మందిని నియమిస్తే సరిపోయేది. కానీ అవసరానికి మించి ఉద్యోగులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోవడం వెనుక భారీ స్కామ్ దాగి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఎల్-1గా నిలిచిన పవర్‌మెక్ సంస్థ 10.5 శాతం ఎక్కువ కోట్ చేసింది. దీంతో టెండర్ల విలువ రూ.218 కోట్లకు చేరింది. చివరిగా సంప్రదింపుల అనంతరం రూ.279.20 కోట్లకు టెండర్లు ఖరారుచేశారు. అంటే ప్రాథమిక అంచనాలతో పోల్చితే దాదాపు రూ.72 కోట్లు పెరిగింది.