హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది చలి తీవ్రత తకువగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్టోబర్లో వర్షపాతం సాధారణం కంటే తకువగా ఉండే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. అక్టోబర్-డిసెంబర్ మధ్య రాష్ట్రవ్యాప్తంగా పగటిపూట గరిష్ఠ, రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 18 శాతం లోటు వర్షపాతం నెలకొన్నట్లు వెల్లడించింది. 14 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 19 జిల్లాల్లో లోటు వర్షపాతం నెలకొన్నట్లు చెప్పింది. నల్లగొండ-56, నిర్మల్, జోగుళాంబ గద్వాల-45, మేడ్చల్ మలాజిగిరి-41 అత్యధిక లోటు వర్షపాతం నమోదైన జిల్లాలుగా పేర్కొన్నది. కామారెడ్డి-13, జగిత్యాల-12, మంచిర్యాల-9 జిల్లాల్లో సాధారణం కన్నా అత్యధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.
4,5 తేదీల్లో వర్షాలు..
ఒకవైపు రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుండగా, మరోవైపు ఈ నెల 4, 5 తేదీల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 34-37 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్లు చెప్పారు. గురువారం ఖమ్మం జిల్లాలో 37.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.