హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా విద్యుత్తు వినియోగం సరికొత్త రికార్డులను నమోదు చేసింది. సెప్టెంబర్ 30 బుధవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ ఏకంగా 19,892 మెగావాట్లకు చేరుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచి ఇప్పటివరకు నమోదైన గరిష్ఠ డిమాండ్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఆగస్టు 9న నమోదైన 19,543 మెగావాట్ల రికార్డును అధిగమిస్తూ, కేవలం మూడు వారాల వ్యవధిలోనే విద్యుత్తు వినియోగం గరిష్ఠ స్థాయికి చే రిందని అధికార వర్గాలు వెల్లడించాయి. వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ పంపుసెట్ల వినియోగం పెరగడంతోపాటు పారిశ్రామిక, వా ణిజ్య రంగాల నుంచి భారీగా డిమాండ్ ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్తున్నారు.
దక్షిణ తెలంగాణలో పీక్ డిమాండ్
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలోనే అత్యధికంగా విద్యుత్తు వినియోగం నమోదైంది. ఒక సెప్టెంబర్ 30న సంస్థ పరిధిలో 12,299 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఏర్పడగా, అధికారులు విజయవంతంగా సరఫరా చేశారు. అదే రోజున రికార్డు స్థాయిలో 223.34 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ను పంపిణీ చేసి సంస్థ మరో మైలురాయిని అధిగమించింది. లోడ్ ఎంత పెరిగినప్పటికీ పంపిణీ వ్యవస్థపై ఒత్తిడి పడకుండా ముందస్తు సాంకేతిక ఏర్పాట్లు చేయడంతో ఎకడా అంతరాయాలు కలగకుండా సరఫరా సాఫీగా సాగింది.
రోజురోజుకూ పెరుగుతున్న వినియోగం
విద్యుత్తు వినియోగం పెరుగుతుండటంపై టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్తు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంజినీర్లు, అధికారులు, క్షేత్రస్థాయి లైన్మెన్లు సమిష్టిగా శ్రమించడం వల్లే ఈ అపూర్వ విజయం సాధ్యమైందని ఆయన అభినందించారు. భవిష్యత్తులో డిమాండ్ మరింత పెరిగినా తట్టుకునేలా ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల నెట్వర్ను పటిష్టపరుస్తున్నామని వివరించారు.