హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): తమ గోడుపట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ పేరుతో హడావుడి చేస్తున్నదని కల్లుగీత కార్మికులు పేర్కొంటున్నారు. కార్మికుల ప్రమాదబీమాను అటకెక్కించి న సర్కార్, ఇప్పుడు తమ అభివృద్ధికి ఏదో పాటుపడుతున్నట్టు కలరింగ్ ఇస్తున్నదని మండిపడ్డుతున్నారు. కల్లుగీత కార్మికులకు మేలు చేయాలనే సంకల్పంతో కేసీఆర్ నీరా కేఫ్‌ను తీసుకొస్తే.. ఆ కేఫ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పడావుపడింది. నాడు సందర్శకులతో కళకళలాడిన నీరా కేఫ్.. నేడు సందర్శకులు లేక కునారిల్లుతున్నది. కేవలం పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ ఉండటంతోనే ఆగమేఘాలపై నీరా కేఫ్‌లో తాత్కాలిక అమ్మకాలు చేపట్టారు. మొన్నటి వరకూ కేఫ్‌లో ఎలాంటి అమ్మకాలు లేకపోగా, ఇప్పుడు హడావిడిగా నీరా అమ్మకాలు చేపట్టింది.
నందనం, నీరా కేఫ్‌లలో.. నీరా, తాటి ఉత్పత్తుల తయారీకి కోట్లు వెచ్చించి ఏర్పాటుచేసిన యంత్రాలు తుప్పుబడుతున్నాయని, రిఫ్రిజిరేషన్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరికరాలు, ఫర్నిచర్, కిచెన్ సామగ్రి పాడవుతున్నట్టు గౌడన్నలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అతిథి, కార్యాలయ గదులు దుమ్ముతో నిండిపోగా, పరిసరాలు కలుపు మొకలతో దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు. గౌడ సంఘాలు ఈ ప్రాజెక్టును తమ ఆత్మగౌరవ ప్రతీకగా భావించినా, కాంగ్రెస్ మంత్రులెవరూ కేఫ్ వైపు చూడకపోవడం బాధాకరమని పేర్కొంటున్నారు. రూ.కోట్ల ప్రజాధనంతో ఏర్పాటుచేసిన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయొద్దని, తక్షణమే వాటిని పునరుద్ధరించి నీరా సేకరణ, విక్రయ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలని కోరుతున్నారు.
రాష్ట్రంలో గీత కార్మికులు ప్రమాదానికి గురై మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా ఆర్థికసాయం అందించే విధానానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాను ‘గీతన్న బీమా’గా అమలు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని మరుగున పెట్టిం ది. 2026 జూలై నాటికి గీత కార్మికులకు ఇవ్వాల్సిన బీమా సొమ్ము రూ.20 కోట్ల వరకు పెండింగ్ ఉన్నట్టు తెలిసింది. బీమా సొమ్ము బాధిత కుటుంబాలకు అందకపోవడంతో వారు నరకయాతన అనుభవిసున్నట్టు గౌడ సంఘాలు పేరొంటున్నాయి.