హైదరాబాద్ : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ఆదివాసీ నాయకులు బీఆర్ఎస్ ( BRS ) పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ జాన్షన్ నాయక్ ( Johnson Naik ) నాయకత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బలమని, తెలంగాణ ప్రజల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీ నిరంతరం ప్రజల తరఫున పోరాడుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పనిచేస్తూ, ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.
పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలిచ్చి, ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత ప్రజల ఆశలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులు, గిరిజనులు, యువత, మహిళలు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించడం లేదని అన్నారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, గిరిజన ఆదివాసీల హక్కులు, సంక్షేమం, ఆత్మగౌరవం కోసం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు.
ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల సీనియర్ ఆదివాసీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధుల కు ఈ సందర్భంగా కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువజన కాంగ్రెస్ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు, కొత్తగూడ గ్రామ మాజీ సర్పంచ్ ఆత్రం రాహుల్‌తో పాటు మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు.