జూలూరుపాడు, మార్చి 30: ప్రభుత్వాలు మారుతున్నా, చట్టాలు రూపాంతరం చెందుతున్నా ఉపాధి హామీ కూలీల తలరాతలు మాత్రం మారడం లేదు. నిప్పులు చెరిగే ఎండల్లో చెమటోడ్చుతున్న కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూలూరుపాడు మండల కేంద్రంలోని కప్పలకుంట ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు యాసా నరేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పని ప్రదేశంలో కూలీల కోసం కనీసం తాగడానికి మంచినీళ్లు, ఎండ దెబ్బ తగలకుండా టెంట్లు, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఫస్ట్ ఎయిడ్ కిట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. “పని ప్రారంభించి నాలుగు నెలలు గడుస్తున్నా, కూలీలకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం అన్యాయం. పొట్టకూటి కోసం పనికి వస్తున్న పేదలను ఆకలితో అలమటించేలా చేయడం తగదు,” అని ఆయన ధ్వజమెత్తారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో అనవసర మార్పులు చేస్తూ, పరోక్షంగా కూలీలను ఈ పథకం నుండి దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. రెండు పూటలా ఫొటోలు తీసే విధానం (NMMS) ఎండ తీవ్రత దృష్ట్యా కూలీలకు భారంగా మారిందని, తక్షణమే పెండింగ్ వేతనాలను విడుదల చేసి, పని ప్రదేశంలో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ బోడ అభిమిత్ర, గార్లపాటి వెంకటి, బల్లి లక్ష్మయ్య, ఎస్.కె.పర్వీన్, వసంత పాల్గొన్నారు.