కల్హేర్, ఆగస్టు 3: వానకాలంలో నల్లవాగు ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల్లో వరి సాగు చేశారని, పంటలు ఎండు దశకు రాక ముందే ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని ఖానాపూర్ (కే)లోని తన నివాస గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులో 1989 అడుగులకు నీరు చేరినప్పటికీ విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని మండిపడ్డారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చివరి ఆయకట్టు వరకు రెండూ పంటలకు నీరందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు ఎడమ, కుడి కాల్వలో పూడిక తీత తీయించక పోవడంతో నీరు సక్రమంగా ప్రవహించపోవడంతో వృథా అవుతున్నదన్నారు. డీఈతో ఫోన్లో మాట్లాడి వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. ఎరువుల యాప్‌తో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎరువులు అందుబాటులో లేక దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తున్నదని, దీంతో రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయా సొసైటీలు, విక్ర య కేంద్రాల్లో సీజన్‌కు సరిపడా ఎరువు లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన విద్యుత్‌ను 12 గంటలు కూడా సరఫరా చేయడం లేదని, దీంతో బోరు మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని భూపాల్‌రెడ్డి అన్నారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ నర్సింహరెడ్డి, బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు రాంసింగ్, సిర్గాపూర్ మాజీ ఎంపీపీ మైపాల్‌రెడ్డి, సర్పంచులు మారుతి, సంగప్ప, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణాగౌడ్, వైస్ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు పండరి, గోపాల్‌రెడ్డి, సాయగౌడ్, నారాయణ, కృష్ణగౌడ్, భూషణం, సాయిలు, కిషన్‌రెడ్డి, నారాయణ, జనార్థన్, వీరేశం, మహబూబ్, ఖాజ, ప్రశాంత్‌సాగర్, ప్రమోద్ పాల్గొన్నారు.