మెట్పల్లి రూరల్, ఆగస్టు 3 : బీఆర్ఎస్ హయాంలోనే వరద కాలువ జీవనదిలా మారిందని, ఆ ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల కొనియాడారు. ఆయన హయాంలో వరదకాలువలో నీళ్లు లేకుండా ఒక్కరోజు కూడా చూడలేదని గుర్తు చేశారు. మెట్పల్లి మండలంలోని రాజేశ్వర్రావుపేట వరదకాలువ వద్ద గల పంపుహౌస్‌ను ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు. గోదావరి జలాలకు పూలు చల్లి పూజలు చేశారు.
అనంతరం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అర్థం కావడం లేదని, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు గ్రావిటీ ద్వారా నీళ్లు పోతున్నాయని ఓ నాయకుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లి కూడా కాళేశ్వరంలో ఒక భాగమేనని స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం మరో భాగమని, రాంపూర్, రాజేశ్వర్రావుపేట, ముప్కాల్ పంపుహౌస్‌ల ద్వారా వరదకాలువలో నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ నింపవచ్చని తెలిపారు.
ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫ్లో తగ్గిపోయిందని, 32 టీఎంసీలే ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, అన్నపూర్ణసాగర్కు వంటి జలాశయాల్లో నీళ్లు లేవని తెలిపారు. ఆగస్టు మొదటి వారం వచ్చినా నాట్లు పూర్తి కాలేదని, పలుచోట్ల నార్లు సైతం ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ నీళ్లు లేకపోయినా మేడిగడ్డ వద్ద ఏడాదంతా నీళ్లు ఉంటాయని, అక్కడి లక్ష్మీబరాజ్ వద్ద ప్రస్తుతం నాలుగు లక్షల క్యూసెక్కులు వృథాగా పోతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ద్రోహులుగా మిగలవద్దని, ఇప్పటికైనా ప్రభుత్వం కన్నెపల్లి పంపుహౌస్ వద్ద నీళ్లు ఎత్తిపోసి జలాశయాలన్నీ నింపాలని కోరారు. అలాగే వరదకాలువ తూముల ద్వారా చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. ఆయనవెంట బీఆర్ఎస్ నాయకులు మారు సాయిరెడ్డి, కాట శ్రీధర్, బద్దం శేఖర్‌రెడ్డి, పీసు తిరుపతిరెడ్డి, నోముల గంగాధర్, ఇట్టెడి భూమారెడ్డి పాల్గొన్నారు.