JrNTR | టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో సెలబ్రిటీల మార్ఫింగ్ వీడియోలను సృష్టించడంపై టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా దేవర సినిమాలోని ‘చుట్టమల్లె’ సాంగ్ ను పోలి ఉండే ఒక డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ తీవ్రంగా స్పందించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పారు.
ఈ సంఘటనపై ఆమె ఎక్స్ వేదికగా స్పందిస్తూ తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక మహిళ డిజిటల్‌గా వేధింపులకు గురవుతుంటే, మరో మహిళగా నేను మౌనంగా ఉండలేను. ఏఐ ద్వారా జరిగిన ఈ దుర్వినియోగం ఎలాంటి వినోదం కాదు, ఇదొక జోక్ అసలే కాదు. ఇది అత్యంత కిరాతకమైన, క్షమించరాని చర్య. ఇది ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉంది అని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని, భద్రతను పణంగా పెట్టేలా టెక్నాలజీని ఆయుధంగా మార్చడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ రోజు జాన్వీ కపూర్ వంతు అయితే, రేపు ఇది మా కుమార్తెలు, సోదరీమణులు లేదా మరే ఇతర మహిళకైనా జరగొచ్చని, అందుకే ప్రతి ఒక్కరూ దీనిపై గళం విప్పాలని పిలుపునిచ్చారు. అలాగే, ఇలాంటి మార్ఫింగ్ కంటెంట్‌ను సృష్టించేవారిపై, షేర్ చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదిలాఉంటే, ఏఐ డీప్‌ఫేక్ వీడియోల దుర్వినియోగంపై ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి తప్పుడు వీడియోలను తయారు చేసేవారు, సర్క్యులేట్ చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, విజయ్ దేవరకొండ కూడా ఏఐ వేధింపులను తీవ్రంగా ఖండించారు.