మేడ్చల్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఆస్తులు నిషేధిత జాబితా నుంచి తొలగించుకునేందుకు ఇచ్చే ఎన్వోసీల జారీపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చ ల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తులతో పాటు భూములను 22ఏ నిషేధిత జాబితాలో ప్రభు త్వం చేర్చింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు అనుమతులు ఇచ్చిన లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసుకుని ఇల్లు నిర్మించుకున్న వాటిని నిషేధిత జాబితాలో చేర్చడంతో అత్యవసరం ఉండి అమ్ముకుందామనుకునే వారికి రిజిస్ట్రేషన్లు కాకపోవడంపై ప్రైవేట్ ఆస్తుల యజమానులు విస్మయానికి గురువుతున్నారు.
అసలు ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం ఏమిటనీ యజమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించుకునేందుకు రెవెన్యూశా ఖ నుంచి ఎన్వోసీలు తీసుకురావాలని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్న క్రమంలో ప్రైవేట్ ఆస్తుల యజమానులు ఎన్వోసీల కోసం తహసీల్దార్ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రైవేట్ ఆస్తుల యజమానులకు ఎన్వోసీల జారీలో చేస్తున్న నిర్లక్ష్యంతో చుక్కలు కనిపిస్తున్నాయి. రెవెన్యూశాఖ అధికారులు ఎన్వోసీలు ఇచ్చేందుకు కావాల్సిన నివేదికను తహసీల్దార్లు ఇచ్చేందుకు కావాలనే కాలయాపన చేస్తున్నట్లు ఎన్వోసీల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు ఆరోపిస్తున్నారు. దరఖాస్తులు చేసుకున్న వారి నివేదికలు ఇచ్చేందుకు నివేదికలను తయారు చేసేందుకు అనేక రోజుల గడువు తీసుకుంటున్నారు.
త్వరగా ఎన్వోసీలు కావాలంటే రెవెన్యూ అధికారులు చేతులు తడపందే నివేదిక ముందుకు పోవడం లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక తహసీల్దార్ల నివేదిక అనంతరం తిరిగి ఆర్డీవో, డీఆర్వో, అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్ వరకు ఫైళ్లు వెళ్లాల్సి ఉంటుంది. దీనికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్న క్రమంలో తమకు ఎన్వోసీలు జారీ అయ్యేది ఎప్పుడని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. అవసరాలకు తమ ఆస్తులను అమ్ముకునేందుకు కూడా వీలు లేకుండా చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సర్కార్‌పై ఉద్యమం
ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించేలా త్వరలోనే ఉద్యమం చేస్తాం. ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రజల తరపున ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నాం. వినతి పత్రాలు ఇచ్చిన అధికారులు, ప్రభుత్వం స్పందించనట్లయితే భారీ ఎత్తున ప్రజలతో కలిసి ధర్నా చేస్తాం. నిషేధిత జాబితా చేర్చడంపై ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
– ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి