కల్వకుర్తి/వంగూరు/ఉప్పునుంతల/తెలకపల్లి, మార్చి 5: రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన యాప్‌లో బుక్ చేసుకోవడం ఎలాగో తెలియక.. స్మార్ట్ ఫోన్ లేక? చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం రేవంత్ సొంత జిల్లా నాగర్‌కర్నూల్‌లోని పలు మండలాల్లో రైతులు గురువారం యాప్‌లో యూరియా బుకింగ్ కాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. కల్వకుర్తి పట్టణంలోని మూడు ఎరువుల దుకాణాల్లో గురువారం యూరియా అందుబాటులో ఉన్నదని అధికారులు రైతులకు సమాచారం అందించారు. దీంతో రైతులు ఉదయం 9 గంటల వరకే ఆయా దుకాణాల వద్దకు చేరుకున్నారు.
ఫర్టిలైజర్ యాప్ ఓపెన్ చేసిన నిమిషంలోపే స్టాక్ జీరో చూపించడంతో రైతులు అవాక్కయ్యారు. నెల రోజులుగా యూరియా కోసం ఫోన్లు చేతిలో పట్టుకొని దుకాణాల చుట్టూ తిరుగుతున్నా దొరకడం లేదంటూ రేవంత్ సర్కార్‌పై శాసనార్థాలు పెట్టారు. ‘పాలిచ్చే బర్రెను వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టు’ తమ పరిస్థితి తయారైందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్కరోజు కూడా ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రాలేదని గుర్తుచేశారు. అలాగే వంగూరు మండలం తిరుమలగిరి హాకా రైతు సేవా కేంద్రంలో 180 బస్తాల యూరియా అందుబాటులో ఉన్నదని, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అధికారులు సమాచారం అందించారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 50 మంది వరకు వచ్చి బుక్ చేసేందుకు ఎంత సేపు యత్నించినా లాభం లేకపోవడంతో అసహనం వ్యక్తంచేశారు.
తీవ్ర ఆగ్రహంతో రైతులు దుకాణం ఎదుట నిరసన తెలిపారు. అలాగే ఉప్పునుంతల మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో 600 బస్తాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రంలో 300 బస్తాలు, తాడూరు హాకా కేంద్రంలో 300 బస్తాలు, గ్రోమోర్ సెంటర్లో 450 బస్తాలు అందుబాటులో ఉంచగా.. విషయం తెలిసిన రైతులు ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. స్టాక్ నిల్ అని చూపడంతో రైతులు కంగుతిన్నారు. కండ్ల ముందే ఒక రైతుకు 35 బస్తాల యూరియా లభించిందని, తనకు మాత్రం ఒక్క బస్తా దొరకలేదని ఉప్పునుంతలకు చెందిన రైతు మల్లయ్య వాపోయాడు. సాగు చేయడం కంటే చావడమే మేలని ఆవేదన చెందాడు. యాప్‌లో బుక్ చేసుకునేలోపే స్టాక్ నిల్ అంటూ ఆన్లైన్లో చూపుతుందని ఆవేదన చెందారు. ఇప్పటికైనా యాప్ ద్వారా యూరియా పంపిణీని రద్దు చేసి రైతులకు నేరుగా అందించాలని కోరారు.