Independence Day : స్వతంత్ర దిన వేడుకల సందర్భంగా ఒక స్కూల్లో విషాదం జరిగింది. ఒక సిమెంట్ పందిరి కూలడంతో ఆరేళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని సంభాల్ తహసీల్, అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధి, మదాలా ఫతేపూర్ గ్రామంలో శనివారం ఉదయం 10.00 గంటలకు జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న అల్ హస్నెయిన్ పాఠశాలలో స్వతంత్ర దిన వేడుకలు సందడిగా సాగుతున్నాయి. ఈ వేడుకలకు విద్యార్థులతోపాటు ఇతరులు హాజరయ్యారు.
వేడుకలు జరుగుతుండగా, 10.00 గంటల సమయంలో అక్కడి మెయిన్ గేట్ సమీపంలో ఉన్న ఒక పందిరి ఉన్నట్లుండి కూలిపోయింది. ఈ ఘటనలో ఆ పందిరి కింద ఉన్న నిజాం అనే ఆరేళ్ల బాలుడు మరణించాడు. బాలుడితోపాటు పదకొండేళ్ల సైఫ్ అలీ, పదేళ్ల బాలుడు షైదానా గాయపడ్డారు. పందిరి కూలిని ఘటనలో మొదట ఈ ముగ్గురు శిథిలాల కింద కూరుకుపోయి, తీవ్రంగా గాయపడ్డారు. అక్కడున్న వారు వెంటనే స్పందించి, శిథిలాల్ని తొలగించారు. ముగ్గురిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి నిజాం అనే బాలుడు మరణించాడు. మరో ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక వైద్యులు మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించాల్సిందిగా సూచించారు.
దీంతో ఇద్దరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ క్రిష్ణ కుమార్ బిష్ణోయ్, జిల్లా మెజిస్ట్రేట్ అంకిత్ ఖండేవాల్ సహా ఉన్నతాధికారులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని, పరిస్తితిని స్వయంగా అంచనా వేశారు.