Aadi Sai Kumar | వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించే హీరో ఆది సాయికుమార్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సైరాబాను’. ఆసక్తికరమైన ప్రేమకథ, రంగులద్దిన పాత్రలు, కడుపుబ్బా నవ్వించే వినోదంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. కృష్ణకాంత్ పరుచూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన బంధవి శ్రీధర్ కథానాయికగా నటిస్తోంది. “A Fun-Filled Journey of Love, Faith & Destiny” అనేది ఈ చిత్రానికి సంబంధించిన ట్యాగ్‌లైన్.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పోస్టర్లో హీరో ఆది సాయికుమార్ సంప్రదాయ తెల్లటి దుస్తులు ధరించి, నుదుట విభూది, మెడలో రుద్రాక్ష మాలలతో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ కనిపించారు. ఆయన వెనుక కూర్చున్న హీరోయిన్ బంధవి శ్రీధర్ నల్లటి హిజాబ్ ధరించి, భుజాలపై చేతులు వేసి కూర్చున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఇదొక విభిన్నమైన హిందూ-ముస్లిం ప్రేమకథా చిత్రమని స్పష్టంగా అర్థమవుతోంది.
పోస్టర్ డిజైనింగ్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఒకవైపు ఆలయం, మరోవైపు ఇస్లామిక్ శైలి స్మారక కట్టడాలు ఉండటం రెండు భిన్నమైన సంస్కృతులు, విశ్వాసాల కలయికను అద్భుతంగా సూచిస్తోంది. జంట చుట్టూ ఎగురుతున్న తెల్లని పావురాలు శాంతి, ఐక్యత, ప్రేమ అనే సందేశాలను చాటుతున్నాయి. విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాలోని రొమాంటిక్ బ్యాక్‌డ్రాప్‌ను చక్కగా పరిచయం చేయడమే కాకుండా, ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు ముందే మంచి స్పందనను రాబట్టాయి.
ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు. చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్లను మేకర్స్ ప్రకటించనున్నారు.