Iran vs US : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పై పూర్తి నియంత్రణ అమెరికా (USA) దేనని ఆ దేశ అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలను ఇరాన్ (Iran) ఖండించింది. హర్మూజ్ జలసంధి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటుందని, దానిని ఎవరూ ఆక్రమించుకోలేరని పేర్కొన్నది. హర్మూజ్‌ను మూసి ఉంచాలా..? తెరవాలా..? అనేది తమ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ (Kazem Gharibabadi) స్పష్టంచేశారు.
యుద్ధ నౌకల మోహరింపు ద్వారా జలసంధిని స్వాధీనం చేసుకోలేరని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అగ్రరాజ్యం తన భ్రమలను విడిచిపెట్టి.. ఓటమిని అంగీకరించే వరకు హర్మూజ్‌పై ఇరాన్ దిగ్బంధనాన్ని అమలు చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. తాము బెదిరింపులకు భయపడబోమని సైనిక ప్రదర్శనలకు లొంగబోమని స్పష్టంచేశారు. హర్మూజ్ ద్వారా నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయని అమెరికా చెబుతున్న మాటల్లో నిజం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు.
గతంలో మాదిరిగానే జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందన్నారు. తమ సాయుధ దళాల అనుమతి లేకుండా ఏ వాణిజ్య నౌక కూడా ఈ మార్గంలో ప్రయాణించబోదని స్పష్టంచేశారు. హర్మూజ్ విషయంలో అమెరికా తప్పుడు అంచనాలు వేస్తోందన్నారు. యుద్ధంలో ఇరాన్‌ను ఓడిస్తామని, ఆ దేశం ఓటమిని చవిచూసిన అనంతరం హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తామని శనివారం జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ వద్ద అణ్వాయుధ సామర్థ్యం ఉండడం ఎప్పటికైనా ప్రమాదమేనని అన్నారు. అందుకే దానిని నాశనం చేయాలనే లక్ష్యంతో యుద్ధానికి దిగినట్లు వెల్లడించారు.