Real Estate | హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంపై అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయి. రేవంత్‌రెడ్డి సర్కార్ దుందుడు నిర్ణయాలతో స్థిరాస్తిరంగంలో క్రయవిక్రయాలు దారుణంగా పడిపోయాయి. హైడ్రా కూల్చివేతలు, ఫార్మాసిటీ రద్దు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గందరగోళం, జీహెచ్ఎంసీ విభజన, గాంధీ సరోవర్ ప్రాజెక్టు వంటి అంశాలు డెవలపర్లు, కొనుగోలుదారుల నమ్మకాన్ని దెబ్బతీశాయి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఎకరం కనీసం రూ.50 లక్షలకుగా పైగా అమ్ముడైతే, నేడు రూ.30 లక్షలకు కూడా భూములు కొనే దిక్కులేకుండా పోయింది. ఇల్లు, ప్లాట్లు సైతం సకాలంలో అమ్ముడుపోక, రియల్ వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, ఐటీ రంగంలో అనిశ్చితి వంటి కారణాలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న పాలనాపరమైన నిర్ణయాలు, విధానాల్లో మార్పులే రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రధాన కారణమని ఆ రంగంలోని వ్యాపారులు వాపోతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జనవరి నాటికి 75.68 శాతం ఆదాయం వచ్చింది. 2025-26లో జనవరినాటికి బడ్జెట్లో ప్రతిపాదించిన లక్ష్యంలో 64.68 శాతమే వచ్చింది. ప్రతిఏటా రియల్ ఎస్టేట్ ఆదాయం ఎంతో కొంత పెరగాల్సింది పోయి గడిచిన రెండేండ్లలో 11 శాతం తగ్గింది.
తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీ ద్వారా వచ్చేది అత్యంత కీలకం. గత రెండేండ్ల్లుగా ఈ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉండటంతో ఆదాయ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. ఖజానాకు ఆదాయం పెరగాలంటే రియల్ ఎస్టేట్ లావాదేవీలు పెరగాలి. కానీ, ఏటా బడ్జెట్ ప్రతిపాదనలు పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఆదాయం పెరుగడం లేదు. హైడ్రా కూల్చివేతలు, మూసీ నదీ తీర ప్రాంత చర్యల నేపథ్యంలో కొనుగోలుదారుల వేచి చూసే ధోరణితో ఆదాయం తగ్గుతున్నది. కాగ్ లెక్కల ప్రకారం.. 2022-23లో డిసెంబర్ వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.10,713.44 కోట్ల ఆదాయం సమకూరింది. జనవరి వరకు రూ.11,806.61 కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చింది. అంటే బడ్జెట్ అంచనాల్లో 75.68 శాతం లక్ష్యాన్ని చేరింది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ పాలనలో 2025-26లో డిసెంబర్ నాటికి రూ.11,304.19 కోట్లు, జనవరి వరకు రూ.12,345.81 (64.68%) కోట్ల ఆదాయం వచ్చింది. అంటే రెండేండ్ల క్రితంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం 11 శాతం తగ్గిందని కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
బీఆర్ఎస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం రాకెట్లా దూసుకెళ్తే.. రేవంత్ పాలనలో నేలచూపులు చూస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు, మూసీ నదీ తీర ప్రాంతాల్లోని చర్యలు మారెట్లో భయాందోళనలను సృష్టించాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా సిటీ ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ రద్దు చేయడం పెట్టుబడిదారులను విస్మయానికి గురిచేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గందరగోళం నెలకొన్నది. జిల్లాల మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనలు, ఆపై వచ్చిన వివరణలు గందరగోళానికి దారితీశాయి. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించే నిర్ణయంపై హైకోర్టు నోటీసులు ఇవ్వడం వంటివి కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రూ.5,000 కోట్లతో ప్రతిపాదించిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ, కూల్చివేతలు తీవ్ర వ్యతిరేకతను ఎదురొంటున్నాయి. ఇలాంటి కాంగ్రెస్ చర్యల కారణంగా హైదరాబాద్‌లో స్థిరాస్తిరంగం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల గణాంకాలు హైదరాబాద్‌లో నెలకొన్న గడ్డు పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. అనరాక్ నివేదిక ప్రకారం.. 2025 మూడవ త్రైమాసికంలో కొత్త గృహాల సరఫరా గత ఏడాదితో పోలిస్తే 38 శాతం క్షీణించింది. హైదరాబాద్‌లో నివాస గృహాల విక్రయాలు 23 శాతం తగ్గి 58,540 యూనిట్ల నుంచి 44,885 యూనిట్లకు పడిపోయాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం.. జనవరి 2026లో రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 14 శాతం తగ్గాయి. ముఖ్యంగా రూ.1 కోటికి పైబడిన గృహాల లావాదేవీల్లో భారీ తగ్గుదల కనిపించింది. దేశంలోని టాప్ ఏడు నగరాల్లో హైదరాబాద్ అత్యధిక ఆఫీస్ స్పేస్ ఖాళీ రేటును నమోదు చేసింది. కొత్త ఆఫీస్ స్పేస్ సరఫరాలో 39 శాతం తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో, ప్రభుత్వం మరింత భరోసా ఇచ్చేలా వ్యవహరించాల్సింది పోయి, గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల పెట్టుబడిదారులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారని క్రెడాయ్ తెలంగాణ ప్రతినిధులు చెప్తున్నారు. మారెట్ పరిస్థితులు స్థిరపడుతున్నాయని కొందరు డెవలపర్లు ఆశాభావంతో ఉన్నా.. విధానపరమైన అనిశ్చితి మాత్రం రియల్ ఎస్టేట్ రంగానికి పెను సవాలుగా మారింది.

2