Illegal Mining | హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రెండు సిమెంట్ కంపెనీల అక్రమ మైనింగ్ గుట్టు రట్టయ్యింది. ఆ కంపెనీలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ-టెండర్లలో చేసిన బాగోతం బయటపడింది. సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వం సున్నపురాయి మైనింగ్ లీజు ఈ-వేలంలో కంపార్టుమెంట్ల నంబర్లు ఇవ్వకుండా ఈ-టెండర్ల ప్రక్రియను నిర్వహించడం వెనుక ఉన్న గూడుపుఠాణి ఎట్టకేలకు ఆధారాలు సహా బయటికొచ్చింది. కొందరు సర్కార్ పెద్దలు తెర వెనుక ఉండి డెక్కన్ సిమెంట్స్, నాగార్జున సిమెంట్స్ లిమిటెడ్ కంపెనీల అక్రమాలను కప్పి పుచ్చేందుకు కథ నడిపినట్టు తెలిసిపోయింది. అంతేకాదు సుల్తాన్పూర్ రిజర్వు ఫారెస్టులో నాగార్జున సిమెంట్స్ లిమిటెడ్‌కు కట్టబెడుతున్న మైనింగ్ బ్లాకు చారిత్రక మట్టపల్లి ఆలయానికి అర కిలోమీటర్లోపు దూరంలోనే ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. అధికారులు కనీసం చారిత్రక నిర్మాణాలను కాపాడాలనే అంశాన్ని సైతం ఈ-టెండర్లలో గాలికొదిలినట్టు స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచీ ఈ వ్యవహారంలో ఉద్దేశపూర్వకంగా మౌనం ప్రదర్శిస్తుండగా.. డెక్కన్ సిమెంట్స్ యజమాని కణతకు తుపాకీ గురిపెట్టి బెదిరించిన ఘట్టాన్ని మంత్రి కొండా సురేఖ కూతురు తెరపైకి తేవడంతో సర్కార్ సంకటంలో పడింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) ఈ అక్రమాలపై దృష్టిసారించడం, ఈ-వేలం అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయడంతో సున్నపురాయి గ‘లీజు’ బాగోతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర గనులశాఖ సూర్యాపేట జిల్లాలోని సైదుల్నామా రిజర్వు ఫారెస్టులో 2024 ఆగస్టులో చేపట్టిన మూడు బ్లాకుల సున్నపురాయి లీజు ఈ-వేలంలో అడుగడుగునా అక్రమాలు జరిగినట్టు మొదటి నుంచీ ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు తెర వెనుక వ్యవహారాన్ని నడిపించడంతో ఎంఎండీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సిమెంట్ కంపెనీలకే సంబంధిత సున్నపురాయి బ్లాకులు దక్కేలా ఈ-టెండర్ల ప్రక్రియ జరిగినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే ఉద్దేశపూర్వకంగా నోటిఫికేషన్లోనే డీజీపీఎస్ కార్నర్ పాయింట్లు (అక్షాంశాలు-రేఖాంశాలు) ఇవ్వాలనే నిబంధనను ఉల్లంఘించినట్టు చెప్తున్నారు. అటవీశాఖ నిర్ధారించిన కంపార్టుమెంట్ల సంఖ్యను బయటికి వెల్లడించకుండానే భారీ విస్తీర్ణంలో గనుల లీజు వ్యవహారాన్ని ముగించారని, అక్రమాలకు ఇది మరో ఆధారమని పేర్కొంటున్నారు. అటవీశాఖ మ్యాపు, గనుల శాఖ పేర్కొంటున్న కార్నర్ పాయింట్లను విశ్లేషిస్తే ఈ-వేలంలో జరిగిన అక్రమాలు కండ్లకు కట్టినట్లుగా అర్థమవుతున్నాయి
ఫొటోలో ఎగువన కనిపిస్తున్న మ్యాపు అటవీశాఖ అధికారికంగా విడుదల చేసింది. రిజర్వు ఫారెస్టును కంపార్టుమెంట్లుగా విభజించడంలో భాగంగా సైదుల్నామా రిజర్వు ఫారెస్టులో ఈ ప్రాంతాన్ని 13,14 కంపార్టుమెంట్లుగా విభజించింది. వాస్తవానికి కంపార్టుమెంటు 14లో నాగార్జున సిమెంట్స్ లిమిటెడ్‌కు 1980 దశకంలోనే మైనింగ్ లీజు వచ్చింది. దానినే 1996లో రెన్యువల్ చేశారు. కానీ సదరు కంపెనీ లీజుకు తీసుకున్న ప్రాంతంలో కాకుండా కంపార్టుమెంటు-13లో అక్రమంగా పెద్దఎత్తున మైనింగ్ చేసిందనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నాట వెంకట్‌రెడ్డి హైకోర్టులో వేసిన కేసు ఇప్పటికీ కొనసాగుతున్నది. వెంకట్‌రెడ్డి కేంద్ర గనుల మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేయడంతోపాటు ఇటీవల సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. ఆ విచారణ కూడా పురోగతిలో ఉన్నది.
ఫొటోలో దిగువన కనిపిస్తున్నది (ఎర్ర రంగులో) గనులశాఖ నిర్వహించిన ఈ-వేలంలో నాగార్జున సిమెంట్స్ లిమిటెడ్ కంపెనీకి కట్టబెట్టిన సున్నపురాయి బ్లాకు. అటవీశాఖ మ్యాపు ప్రకారం ఈ బ్లాకు రెండు కంపార్టుమెంట్లలో విస్తరించి ఉన్నది. నిబంధనల ప్రకారం మైనింగ్ కోసం లీజు ఇచ్చే ప్రాంతం ఏ కంపార్టుమెంట్లో ఉన్నదో, దాని అక్షాంశాలు, రేఖాంశాలు ఏమిటనేవి టెండర్ నోటిఫికేషన్‌తోపాటు టెండర్ బిడ్‌లో స్పష్టంగా పేర్కొనాలి. కానీ అధికారులు నోటిఫికేషన్లో అక్షాంశాలు-రేఖాంశాలను పేర్కొనలేదు. టెండర్ బిడ్‌లో అవి పొందుపరిచినా అసలు కంపార్టుమెంట్‌ను ప్రకటించలేదు. కారణం.. నాగార్జున సిమెంట్స్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందనే ఆరోపణల నుంచి ఆ కంపెనీని కాపాడేందుకు ఈ స్కెచ్ వేశారనే చర్చ జోరుగా జరుగుతున్నది. అందుకే అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపార్టుమెంట్-13లోని ప్రాంతం కూడా ప్రస్తుతం దక్కించుకున్న బ్లాకు పరిధిలోకి వచ్చింది. పైగా ఈ బ్లాకు ఎలాంటి పోటీ లేకుండా నాగార్జున సిమెంట్స్‌కే దక్కింది. తద్వారా అక్రమ మైనింగ్‌ను కప్పిపుచ్చుకునేందుకు ఆస్కారం కల్పించినట్లయింది. అంటే బారాఖూన్ మాఫ్ అన్నట్లు!
ఫొటోలో కనిపిస్తున్నది సైదుల్నామా రిజర్వు ఫారెస్టు. ఇందులో పసుపు పచ్చ సర్కిల్లో కనిపిస్తున్న గుంతల ప్రాంతం డెక్కన్ సిమెంట్స్ మైనింగ్ చేసినది. 1987 నుంచి పలు దఫాలుగా అధికారికంగా లీజు తీసుకొని సున్నపురాయిని వెలికితీసి సిమెంట్ పరిశ్రమకు వినియోగించుకొంటుంది. అయితే డెక్కన్ కంపెనీ తమకు అనుమతి ఇచ్చిన ప్రాంతం కంటే ఎక్కువ విస్తీర్ణంలో అక్రమ మైనింగ్ జరిపిందని, ఈ మేరకు అటవీశాఖ ఏర్పాటు చేసిన సరిహద్దులను సైతం మార్చిందనేది ప్రధాన ఆరోపణ. ఈ మేరకు ఇంజినీర్ పసుపులేటి సురేశ్‌బాబు హైకోర్టులో కేసు వేయడంతోపాటు కేంద్ర సాధికారత కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా సీఈసీ వివరాలు కోరినా తెలంగాణ గనులు, అటవీ శాఖలు సరైన సమాచారం ఇవ్వలేదు. దీంతో గతనెల 25న ప్రత్యక్షంగా అధికారులను పిలిచించి కమిటీ విచారణ చేపట్టింది.
ఫొటోలో ఎర్ర రంగులో కనిపిస్తున్న ప్రాంతం 2024 ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ-వేలంలో డెక్కన్ సిమెంట్స్ లీజు దక్కించుకున్న విస్తీర్ణం. ఇక్కడ కూడా అధికారులు టెండర్ నోటిఫికేషన్లో అక్షాంశాలు-రేఖాంశాలు వెల్లడించలేదు. టెండరు బిడ్‌లోనే కాదు ఇప్పటికీ అసలు కంపార్టుమెంట్ సంఖ్య ఏందో కూడా అధికారులు వెల్లడించలేదు. సరిగ్గా ఈ-టెండర్లలో ఈ బ్లాకు డెక్కన్ సిమెంట్స్‌కే దక్కింది. అంటే అక్రమ మైనింగ్ ఎదుర్కొంటున్న ప్రాం తం కూడా తాజాగా దక్కించుకున్న బ్లా కులోనే ఉండిపోతున్నది. తద్వారా అక్ర మం సక్రమం అయిపోతుందనేది తెర వెనుక పెద్దలు-సదరు సిమెంట్ కంపెనీ స్కెచ్ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం సున్నపురాయి గనుల లీజు ఈ-వేలంలో భాగంగా సుల్తాన్పూర్ రిజర్వు ఫారెస్టులో నాగార్జున సిమెంట్స్‌కు కట్టబెట్టిన మైనింగ్ ప్రాంతం చారిత్రక మట్టపల్లి ఆలయానికి దగ్గరలో ఉన్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది. సాధారణ ప్రాంతాల్లోనే జనవాసాలకు మైనింగ్ ప్రాంతం కనీసం అర కిలోమీటర్ దూరంలో ఉండాలనే నిబంధన ఉన్నట్టు సమాచారం. చారిత్రక నిర్మాణాల విషయంలో ఈ నిబంధన మరింత కఠినంగా ఉంటుంది. కానీ గనులశాఖ రికార్డుల్లోని అక్షాంశాలు-రేఖాంశాల ద్వారా మైనింగ్ లీజు ప్రాంతాన్ని గూగుల్‌లో ఇంపోజ్ చేసి చూస్తే మట్టపల్లి చారిత్రక ఆలయానికి అర కిలోమీటర్ దూరంలోనే బ్లాకు సరిహద్దు ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో ఇంతటి కీలకమైన అంశాన్ని ఎలా మరిచారు? అనే ఆందోళన వ్యక్తమవుతున్నది. దీంతోపాటు ఈ బ్లాకు మధ్యలో నుంచే తెలంగాణ-ఏపీ రాష్ర్టాలకు కృష్ణా నదిపై నుంచి అనుసంధానంగా ఉన్న తంగడ-మట్టపల్లి ప్రధాన రోడ్డు కూడా ఉండటం గమనార్హం.
డెక్కన్ సిమెంట్స్ అరాచకాలపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అయితే సరైన సమాచారం ఇవ్వలేదనే కారణంతో రాష్ట్ర గనులు, అటవీశాఖ అధికారులకు సీఈసీ నోటీసులు ఇచ్చి గతనెల 25న ఢిల్లీలో విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారు, ఇంజినీర్ పసుపులేటి సురేశ్‌బాబు క్షేత్రస్థాయి విచారణ (ఫీల్డ్ ఎంక్వయిరీ) చేయించాలని సీఈసీని కోరారు. దీనికి సీఈసీ చైర్మన్ అనుమతిస్తూ ఫిర్యాదుదారు సమక్షంలోనే విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో విచారణ ఎప్పుడు చేపట్టనున్నారో తనకు అధికారికంగా సమాచారం ఇవ్వాలని సురేశ్‌బాబు గురువారం పీసీసీఎఫ్‌కు లేఖ రాశారు. అటవీశాఖ మంత్రి కొండా సురేఖను కూడా కలిసి ఈ లేఖను ఇవ్వడంతో, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని లేఖపై మంత్రి ఎండార్స్ చేశారు. ప్రధానంగా కేంద్ర సాధికారత కమిటీ సూచనలకు కట్టుబడి చర్యలు తీసుకోవాలని అందులో సూచించారు. క్షేత్రస్థాయి విచారణ తేదీని నిర్ణయించి.. కనీసం మూడు రోజుల ముందు తనకు సమాచారం ఇవ్వాల్సిందిగా సురేశ్‌బాబు తన లేఖలో కోరారు.