Vitamin B12 | మన శరీరానికి కావల్సిన అనేక విటమిన్లలో విటమిన్ బి12 కూడా ఒకటి. దీన్నే సయానో కోబాలమైన్ లేదా కోబాలమైన్ అని పిలుస్తారు. మన శరీరంలో అనేక జీవక్రియలను సరిగ్గా నిర్వహించడంలో విటమిన్ బి12 ముఖ్య పాత్ర పోషిస్తుంది. నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. డీఎన్ఏ సంశ్లేషణకు సహాయం చేస్తుంది. విటమిన్ బి12 లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇవి కొందరిలో పలు లక్షణాలను కలగజేస్తాయి. విటమిన్ బి12 లోపం వల్ల కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ కొందరిలో స్వల్ప లేదా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఒక్కొక్కరిలో వేర్వేరుగా ఉంటాయి. విటమిన్ బి12 లోపం వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ బి12 మనకు అధికంగా మాంసం లేదా జంతు సంబంధ ఉత్పత్తుల్లో లభిస్తుంది. అందువల్ల మాంసాహారాల్లో ఈ సమస్య కనిపించడం అరుదు. శాకాహారుల్లో, కనీసం కోడిగుడ్లు తినని వారు లేదా పాలు తాగని వారు, పెరుగు, నెయ్యి వంటివి కూడా తినని వారిలో ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది. కొందరు మాంసాహారం తింటున్నా ఇతర పోషకాహారాలను తినకపోవడం వల్ల కూడా విటమిన్ బి12 లోపం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉంటే అలాంటి వారి శరీరం విటమిన్ బి12 ను సరిగ్గా శోషించుకోలేదు. దీంతో కూడా ఈ విటమిన్ లోపం ఏర్పడుంది. జీర్ణాశయ, పేగుల సమస్యలు ఉన్నా, శస్త్ర చికిత్సలు జరిగిన వారిలో, డయాబెటిస్ లేదా గ్యాస్ ట్రబుల్ మందులను వాడేవారిలో విటమిన్ బి12 లోపం వస్తుంది. విటమిన్ బి12 లోపం ఉంటే తీవ్రమైన నీరసం, అలసట ఉంటాయి. చేతులు, పాదాల్లో స్పర్శ లేనట్లు ఉంటుంది లేదా సూదుల్తో గుచ్చినట్లు ఉంటుంది.
విటమిన్ బి12 లోపం ఉన్నవారిలో కొందరికి చర్మం పాలిపోయి లేదా పసుపు రంగులో కనిపిస్తుంది. నాలుక వాపులకు గురై ఎరుపు రంగులో దర్శనమిస్తుంది. ఆకలి అనిపించదు. ఏ ఆహారం తినాలనిపించదు. బరువు తగ్గుతారు. ఏ విషయంపై కూడా ధ్యాస పెట్టలేకపోతుంటారు. శ్వాస తీసుకోవడంలో సమస్యగా అనిపిస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లోపిస్తాయి. కొందరు డిప్రెషన్ బారిన పడతారు. చిరాగ్గా అనిపిస్తుంది. ఇక రోజుకు ఎవరికి ఎంత మోతాదులో విటమిన్ బి12 అవసరం అవుతుందనే విషయానికి వస్తే 19 ఏళ్లకు పైబడిన వారికి రోజుకు 2.4 మైక్రోగ్రాముల మేర విటమిన్ బి12 అవసరం. గర్భిణీలకు రోజుకు 2.6 మైక్రోగ్రాముల మేర ఈ విటమిన్ కావాలి. పాలిచ్చే తల్లులు రోజుకు 2.8 మైక్రోగ్రాముల విటమిన్ బి12ను తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ బి12 లోపం ఉన్నవారికి వైద్యులు మందులను ఇస్తుంటారు. విటమిన్ బి12 ట్యాబ్లెట్లను డాక్టర్ సలహా మేరకు వేసుకుంటే ఈ లోపం తగ్గుతుంది. సాధారణంగా 500 మైక్రోగ్రాముల విటమిన్ బి12 ట్యాబ్లెట్ను మింగితే అందులో శరీరం కేవలం 10 మైక్రోగ్రాముల విటమిన్ బి12 ను మాత్రమే శోషించుకుంటుంది.
విటమిన్ బి12 మనకు ఎక్కువగా జంతు సంబంధ ఉత్పత్తుల్లో లభిస్తుంది. మటన్ లివర్, కిడ్నీలు, చేపలు, రొయ్యలు, పాలు, చీజ్, పెరుగు, కోడిగుడ్లు, చికెన్ వంటి ఆహారాలను తరచూ తింటుంటే విటమిన్ బి12ను పొందవచ్చు. పలు శాకాహారాల్లోనూ మనకు విటమిన్ బి12 స్వల్ప మోతాదులో లభిస్తుంది. ఫోర్టిఫైడ్ సిరియల్స్, సోయా పాలు, బాదం పాలు, న్యూట్రిషనల్ ఈస్ట్, పుట్టగొడుగులు వంటి శాకాహారాలను తినడం వల్ల కూడా విటమిన్ బి12 లభిస్తుంది. కానీ వీటిల్లో స్వల్ప మోతాదులో మాత్రమే ఈ విటమిన్ ఉంటుంది. ఇలా విటమిన్ బి12 ఉన్న ఆహారాలను రోజూ తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు.