Meenakshi Chaudhary | ప్రస్తుతం టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల విజయ్-రష్మిక వివాహం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే మార్చి 6న అల్లు శిరీష్– నయనిక రెడ్డి వివాహం జరగనుండటంతో సినీ వర్గాల్లో పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇదే సమయంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి వ్యక్తిగత జీవితంపై కూడా కొన్ని గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వాటిపై స్పష్టత ఇచ్చారు. తన అందం, నటనతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించిన హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఆసక్తికర విషయం ఏమిటంటే, చాలా మంది నటీనటులు డాక్టర్ అవ్వాలని అనుకుని సినిమాల్లోకి వచ్చామని చెబుతుంటారు. కానీ మీనాక్షి మాత్రం నిజంగానే డెంటిస్ట్ చదివి తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.
మొదట మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె, తర్వాత వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ సినిమాల్లో ముందుకు సాగారు. 2019లో వచ్చిన హిందీ సినిమా అప్‌స్టార్ట్స్ ద్వారా మొదటిసారి తెరపై కనిపించిన మీనాక్షి, 2021లో వచ్చిన ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఖిలాడీ, హిట్: ది సెకండ్ కేసు, గుంటూరు కారం వంటి చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ ఆమెకు మంచి పేరు తెచ్చింది. అలాగే వెకంటేష్తో కలిసి చేసిన సంక్రాంతికి వస్తున్నాం కూడా మంచి విజయాన్ని అందుకుంది.
తెలుగు మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఆమె పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమాలో మీనాక్షి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆమె లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, కొంతకాలంగా మీనాక్షి చౌదరి ఒక తెలుగు హీరోతో రిలేషన్లో ఉన్నారని గాసిప్స్ వినిపించాయి. ఆ హీరో మరెవరో కాదు సుశాంత్. వీరిద్దరూ కలిసి నటించినఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమా షూటింగ్ సమయంలో స్నేహం పెరిగి అది ప్రేమగా మారిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించిన మీనాక్షి, వాటిని పూర్తిగా ఖండించారు. సుశాంత్‌తో తనకు ప్రేమ సంబంధం లేదని, అతను మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ విషయంపై గాసిప్స్ ఎక్కువ కావడంతో మీనాక్షి టీమ్ కూడా స్పందించి ఇద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది.