Viral news : సాధారణంగా ప్రసవానంతరం ఏ తల్లి అయినా బిడ్డను చూసుకుని మురిసిపోతుంది. అప్పటిదాకా తాను భరించిన ప్రసవ వేదనను బిడ్డను చూడగానే మరిచిపోతుంది. కానీ ఓ తల్లి మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది. ఆకలితో ఏడుస్తున్న బిడ్డకు పాలుపట్టి నిద్రపుచ్చడానికి బదులుగా.. ఆ బిడ్డను ఫ్రిడ్జ్‌లో పెట్టి తను హాయిగా నిద్రపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.
మొరాదాబాద్‌కు చెందిన 23 ఏళ్ల మహిళ 15 రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దాంతో ఆమె దెయ్యం పట్టిందని కుటుంబసభ్యులు క్షుద్రపూజలు చేయించారు. దాంతో ఆమె ప్రవర్తన మరింత వింతగా మారింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఆకలితో ఏడుస్తున్న బిడ్డకు పాలుపట్టకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టి తాను నిద్రపోయింది. బిడ్డ ఏడుపు మరింత ఎక్కువ కావడంతో అతడి నానమ్మ వచ్చి చూసేసరికి ఫ్రిడ్జ్‌లో ఉన్నాడు. కోడలు హాయిగా నిద్రపోతూ కనిపించింది.
వెంటనే బాలుడిని బయటికి తీసిన అతడి నానమ్మ కుటుంబసభ్యులతో కలిసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. పరిశీలించిన వైద్యులు బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని చెప్పారు. అనంతరం తల్లిని కూడా వైద్యులకు చూపించగా పరీక్షలు చేసి ఆమె ‘పోస్ట్‌పార్టం సైకోసిస్ (Postpartum psychosis)’ తో బాధపడుతున్నారని నిర్ధారించారు. పోస్ట్‌పార్టం సైకోసిస్ అంటే ప్రసవానంతరం అత్యంత అరుదుగా వచ్చే మానసిక సమస్య అని చెప్పారు.
చాలామంది మహిళలు ప్రసవం తర్వాత కొంత అయోమయానికి గురవుతారని, అయితే ఆ అయోమయం కొన్ని రోజులు మాత్రమే ఉండి, తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు తెలిపారు. కానీ పోస్ట్‌పార్టం సైకోసిస్ అనే రుగ్మత అలా కాదని, ఇది చాలా తీవ్రమైన మానసిక సమస్య అని చెప్పారు. ఈ సమస్య మరింత ముదిరితే తల్లీబిడ్డల ప్రాణాలకే ప్రమాదమని వెల్లడించారు.
ప్రసవం తర్వాత కుటుంబసభ్యులు బాలింతను పెద్దగా పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెప్పారు. బాలింత భావోద్వేగాలను అదుపులో ఉంచేందుకు కుటుంబసభ్యుల నుంచి కావాల్సినంత మద్దతు అవసరమని చెప్పారు. మహిళలు పోస్ట్‌పార్టం సైకోసిస్ బారినపడితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని, లేదంటే సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపారు.