Akhilesh Yadav : ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA alliance) పని అయిపోయిందని, ఆ కూటమిలోని పార్టీల మధ్య సఖ్యత లేదని జరుగుతున్న ప్రచారంపై ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) మాజీ ముఖ్యమంత్రి (Former CM), సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) స్పందించారు. ఇండియా కూటమి చెక్కుచెదరదని, బలంగా ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.
‘ఇండియా కూటమి బలంగా ఉంది. అది చెక్కుచెదరదు. ఎవరైనా కూటమి నుంచి వెళ్లిపోవాలనుకుంటే స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు. ఎవరూ ఆపరు. అంతేగానీ కూటమిలో ఉంటూ కూటమిని పలుచన చేసే వ్యాఖ్యలు చేయొద్దు’ అని అఖిలేష్ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లో 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తాచాటుతుందని అన్నారు.
మంగళవారం మధ్యాహ్నం లక్నోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. మహాకుంభమేళా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, అందుకు సంబంధించిన పేర్లను ఎందుకు వెల్లడించడంలేదని ప్రశ్నించారు.