సిటీబ్యూరో, జూన్ 16(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిటీలో కార్లు, బైక్‌లపై వెళ్తూ సిగ్నల్ జంప్ చేస్తున్నారా.. హెల్మెట్ పెట్టుకోకుండా ఓవర్ స్పీడ్ మెయింటేన్ చేస్తున్నారా.. ఇలా ఎలాంటి ట్రాఫిక్‌రూల్స్ బ్రేక్ చేసినా కెమెరాలు చూస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకున్నా కెమెరాల నుంచి తప్పించుకోలేరనే విషయం ట్రాఫిక్ చలాన్లను చూస్తే తెలుస్తుంది.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2024లో ప్రతిరోజు సుమారుగా 15,438 ట్రాఫిక్ చలాన్లు వేసినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు. సామాజిక కార్యకర్త, ఆర్టీఐ యాక్టివిస్ట్ లోకేంద్రసింగ్ ట్రాఫిక్ చలాన్లపై అడిగిన సమాచారానికి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నగరంలో రోజుకు ఈ చలాన్లు వివిధ మార్గాల్లో వేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సర్వేలెన్స్ సిస్టమ్‌తో పాటు కెమెరాల ద్వారా ట్రాఫిక్ చలాన్లు వేశారని అధికారులు ధ్రువీకరించారు.
ఈ రోజువారి చలాన్లలో సుమారుగా 2వేల చలాన్లు ఏపీఎన్ఆర్ సిస్టమ్ ద్వారా వేసినట్లుగా వారు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టంలో భాగంగా ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్పీఆర్)వ్యవస్థతో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారికి చలాన్లు విధిస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేసినా ఏఎన్పీఆర్ కెమెరాలు వెహికల్ నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి ఆటోమెటిక్‌గా చలాన్ జనరేట్ చేయడంతో పాటు ఆ ఫొటోలు, బండి వివరాలను కమిషనరేట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు చేరవేస్తాయి.
సిటీలో ప్రస్తుతం 284 ఏపీఎన్ఆర్ కెమెరాలు యాక్టివ్‌గా ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు హైదరాబాద్‌లోని ప్రధానంగా అధిక ట్రాఫిక్ ఉండే సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్లలో ఉన్నాయని, అందులోనూ మేజర్ జంక్షన్లు అ యిన ఎంజేమార్కెట్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, పారడైజ్ సర్కిల్‌లలో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఎక్కువ ట్రాఫిక్ ఉండే వెస్ట్‌జోన్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్లలో అధిక సంఖ్యలో ఏఎన్పీఆర్ కెమెరాలు ఉన్నాయని, అదేవిధంగా సౌత్జోన్లో చాంద్రాయణగుట్ట, హుస్సేనిఆలం వంటి చోట్ల తక్కువ కెమెరాలు ఉన్నట్లుగా వివరించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీస్ విభాగం పరిధిలో గత సంవత్సరం రూ.56.34లక్షల చలాన్లు వేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందులో రూ. 46.61 లక్షలు వసూలు చేసినట్లు వారు పేర్కొన్నారు. సైఫాబాద్, బేగంపేట, నారాయణగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపుగా 95శాతానికి పైగా చలాన్లు వసూలు చేస్తే అంబర్‌పేట, లంగర్‌హౌస్, సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేవలం 31శాతం లోపే వసూలయ్యాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.