కోడేరు, మార్చి 8 : మండలంలోని వివిధ గ్రామాల గుండా వెళ్తున్న మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్ఐ) కాల్వపై వంతెన నిర్మాణాలపై సీమాంధ్ర కాంట్రాక్టర్లు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఎంజీకేఎల్ఐ బ్రాంచ్ కాల్వల ద్వారా రైతుల పొలాలకు నీళ్లు అందించేందుకు అవసరమైన చోట్ల యూటీలు, పిల్లకాల్వలు లేకపోవడంతోపాటు పలు చోట్లా రైతులు వారివారి పొలాలకు వెళ్లేందుకు వంతెనలు నిర్మించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2016లో ఎంజీకేఎల్ఐ ద్వారా రెండో లిఫ్ట్ నుంచి మోటర్లను రన్ చేయించి జొన్నలబొగుడ రిజర్వాయర్‌కు సాగునీటిని వదిలారు. అక్కడి నుంచి బ్రాంచ్ కెనాల్ ద్వారా రైతుల పొలాలకు సాగునీటిని వదిలారు.
అయితే కాల్వలు సక్రమంగా లేనందులన నీరంతా వృథాగా కిందికి పోతున్నాయని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పసుపుల, కోడేరు, నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, ఎత్తం, కోండ్రావుపల్లి, నర్సాయపల్లి, మైలా రం గ్రామాల శివారుల్లో నుంచి డిస్ట్రిబ్యూటరీ కాల్వల ద్వారా ఆయా గ్రామాల శివారు పొ లాలకు సాగునీరు అందించేందుకు అధికారులు కాల్వలు తవ్వి వదిలేశారు. దీనికి తోడు కాల్వలపై నేటికీ యూటీలు, వంతెనలు నిర్మించకపోవడంతో రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లటానికి తీవ్ర వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. ఒకవైపు బ్రాంచ్ కాల్వ ద్వారా ఇప్పటికే నీల్లు వదిలారు. అయితే తమ గ్రామాలకు వెళ్లే కాల్వ పనులు నేటికీ అసంపూర్తిగా ఉన్నం దున రైతులు అందరి పొలాలకు నీళ్లు అందడం లేదని ఈ విషయమై ఇరిగేషన్ శాఖ అధికారులకు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని రైతుల ఆరోపిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
మండలంలోని పసుపుల గ్రామ శివారులోని ప్రధాన కాల్వ 10వ కిలోమీటర్ నుంచి బ్రాంచ్ కెనాల్ ద్వారా కోడేరు, వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలాలకు కలిపి సుమారు 120 కిలోమీటర్ల పొడవునా బ్రాంచ్ కాల్వను తవ్వా రు. పసుపుల బావాయిపల్లి, జనుంపల్లి, కోడే రు, నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రాజాపూర్, మైలారం, ఎత్తం, నర్సాయపల్లి, కోండ్రావుపల్లి, వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం కదిరేపాడు, శాగాపూర్ మీదుగా పాన్‌గల్ వరకు బ్రాంచ్ కెనాల్ ద్వారా రైతుల పొలాలకు సాగునీటిని వదులుతున్నారు. అయితే ఆయా గ్రామాల్లో కాల్వ రెండు వైపులా పొలాలు ఉన్నందున ఎడమ వైపున పొలా లు ఉన్న రైతులు కుడి వైపునకు వెళ్లలేని దుస్థితి నెలకొన్నది.
కిలో మీటర్ల పొడవునా కాల్వ ఉన్నందున ఇవతలి వైపున ఉన్న రైతులు చుట్టూ తిరిగి వారి పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా నేటికీ కాల్వ పనులను సంబంధిత కాంట్రాక్టర్లు అసంపూర్తిగానే వదిలేశారని రైతులు ఆరోపిస్తున్నారు. చాలా చోట్ల కాల్వలపై వంతెనలు లేనందున రైతులే స్వయంగా కాల్వకు అడ్డంగా పైపులు, పెద్ద మొద్దులను వేసి ఇవుతలి నుంచి అవుతలికి ప్రయాణిస్తున్నారు. ఈ సమస్య ప్రధానంగా కోడేరు, బావాయిపల్లి, ఎత్తం, నాగులపల్లి, శివారు నెలకొన్నది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు వారే నానా తిప్పలుపడి తమ పొలాలకు వెళ్తున్నారు. కానీ పశువులను కాల్వ దాటించటానికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారుమని రైతులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కాల్వలపై యూటీలు, పిల్లల కాల్వలు, వంతెనలు, రహదారులను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
పంటకాల్వలు లేక ఇబ్బందులు..
పెద్ద కాల్వ కింద రైతుల అందరి పొలాలకు నీళ్లు వెళ్లటానికి అవసరమైన పంటకాల్వలు, పిల్లకాల్వలు ఏర్పా టు చేయలేదు. దీంతో పెద్ద కాల్వ పక్కన ఉన్న రైతుల పొలాలకు నీళ్లు అందడం లేదు. కాల్వల కు దూరం ఉన్న రైతుల పొలాలకు సైతం నీళ్లు రావడం లేదు. వచ్చే వానకాలం వరకైనా పిల్ల కాల్వలు పూర్తి చేసి ప్రతి రైతు పొలానికి నీళ్లు ఇవ్వాలి.
– ప్రతాప్‌రెడ్డి, రైతు, నాగులపల్లి, కోడేరు మండలం
ప్రతి రైతు పొలానికి నీళ్లు అందించాలి..
బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న అన్ని గ్రామాల్లోని ప్రతి రైతు పొలానికి నీళ్లు అందించాలి. కొందరికి వచ్చి మరికొందరికి రాకపోతే నస్టం వచ్చినట్లే కదా. అందరి రైతులకు నీల్లు రావాలి పంటలు పండాలి అప్పుడే అందరం ఆనందంగా ఉంటాం. కానీ సగం నీల్లు వస్తే ఎట్లా..? దూరం ఎక్కువ ఉన్నందున కాల్వలో మోటర్లను ఏర్పాటు చేసి పైపుల ద్వారా పొలాలకు నీళ్లు తీసుకుపోతున్నాం.
– బద్దుల మల్లయ్య, రైతు, కోడేరు