కోదాడ, ఆగస్టు 17 : అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు భరోసా ఇచ్చేందుకు అమలు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, తక్షణమే నిధులు మంజూరు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం కోదాడ గాంధీ విగ్రహం ఎదుట మహిళలు నాయకులతో కలిసి నిరసన చేపట్టారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను మరచి ఇబ్బందుల గురి చేస్తుందని విమర్శించారు. పథకాలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి ఒక లక్ష 16 రూపాయలు సకాలంలో అందజేసిందన్నారు. ఎన్నికల హామీలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష తో పాటు తులం బంగారం ఇస్తానని మహిళలను మోసం చేసి ఓట్లు వేయించుకుని ఇప్పుడు మొండి చేయి చూపిస్తుందన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు.
పథకాల అమలులో చట్టపరమైన సాంకేతిక లోపాలు ఉంటే సరిచేసుకోవాలి తప్పితే దానిని అడ్డుపెట్టి ఏకంగా పథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం కుట్ర చేయడం దారుణమన్నారు. అనంతరం తక్షణమే అరులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని వర్తింపజేయాలని మహిళలతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షుడు నయీమ్, 9వ వార్డు కౌన్సిలర్ నరేష్, కోదాడ మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, బీఆర్ఎస్ అనంతగిరి అధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి, చిలుకూరు మండల అధ్యక్షులు జానకి రామాచారి, తొగర్రాయి మాజీ సర్పంచ్ దొంగరి లక్ష్మీనారాయణ, తుమ్మలపల్లి అజంతా భాస్కర్, తాళ్లూరి పద్మ శ్రీనివాస్, విజయలక్ష్మి, గణపవరం గ్రామ సర్పంచ్ పొట్టా శ్రీ విజయా కిరణ్ పాల్గొన్నారు.

నిరుపేద ఆడబిడ్డలతో ప్రభుత్వం చెలగాటం : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్