భూపాలపల్లి: అధికార కాంగ్రెస్ పార్టీలో (Congress) విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరంగల్లో మంత్రి కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. మీడియా సమావేశాలు పెట్టిమరీ ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలు చీలిపోయింది. మండల పార్టీ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన మద్దతుదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ అవి విఫలమైనట్లు తెలుస్తున్నది.
టేకుమట్ల, చిట్యాల శివార్ల నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండలంలో పార్టీ రెండు వర్గాలుగా చీలడంతో ఒక వర్గంపై మరో వర్గం పైచేయి సాధించేందుకు ధర్నా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.