ములుగు, సెప్టెంబర్18 (నమస్తే తెలంగాణ) : ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి, మాధవరావుపల్లి శివారులోని ప్రభుత్వ భూముల్లో మట్టి వ్యాపారులు దర్జాగా మట్టిని తోడుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు శివారు ప్రాంతాల్లోని భవన నిర్మాణాలు, కొత్తగా వెలుస్తున్న రియల్ ఎస్టేట్ వెం చర్లకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ.6వేల నుంచి రూ.8వేలు వసూలు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. చీకటిపడిందే తడవుగా మట్టి వ్యాపారులు రెచ్చిపోతున్నారు. పదుల సంఖ్యలో లారీలు, టిప్పర్లు, జేసీబీలతో మట్టి తవ్వకాలు జరిపి తరలిస్తున్నారు.
ముఖ్యంగా బండారుపల్లి శివారు సర్వే నంబర్ 298లోని భూములతోపాటు మాధవరావుపల్లి శివారులో గిరిజన యూనివర్శిటీకి కేటాయించిన ప్రభుత్వ భూములు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన కలెక్టరేట్ సమీపంలో కోర్టు, ఎస్పీ కార్యాలయానికి కేటాయించిన భూముల్లో సైతం గత కొన్ని నెలలుగా జోరుగా మట్టిని తవ్వుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బండారుపల్లి శివారులోని ప్రభుత్వ భూములను వివిధ కార్యాలయాలు, స్టేడియం నిర్మాణానికి కేటాయించారు. వాటిలోకి ఎవరైనా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు సంరక్షణ చర్యలు చేపట్టారు.
కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా మట్టి వ్యాపారులు చొరబడి రేయింబవళ్లు మట్టి తవ్వకాలను చేపడుతున్నారు. అయితే, వీరు గత కొన్ని నెలలుగా రాత్రి పూట చీకట్లో తమ వ్యాపారాన్ని సాఫీగా పూర్తి చేసుకుంటున్నారు. ఉద యం నుంచి సాయంత్రం వరకు జేసీబీలు, లారీలు ఎవరి కంట పడకుండా మట్టి తవ్వకాల ప్రాంతాల్లో తాత్కాలిక షల్టర్లను ఏర్పాటు చేసుకొని కాపలా కాస్తున్నారు.
చీకటి పడగానే యంత్రాల సాయంతో ప్రభుత్వ భూముల్లోని మట్టిని పెద్ద ఎత్తున తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ తతంగమంతా రెవెన్యూ, మైనింగ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు ముడుపుల మత్తులో తేలియాడుతూ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి మట్టి వ్యాపారులపై చర్యలు తీసుకొని లారీలు, జేసీబీలను సీజ్ చేయడంతోపాటు సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.