Pistachios | చాలా మంది ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన గింజల్లో పిస్తా పప్పు ఒకటి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు అనేకం ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేయడంలో పిస్తా పప్పు ఎంతో సహాయపడుతుంది. రాత్రి సమయంలో స్నాక్స్ గా తినడానికి పిస్తా పప్పు చాలా చక్కగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పిస్తా పప్పు తృప్తి కలిగించే ఆహారమని వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక వీటిని మితంగా తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే పిస్తా పప్పును తీసుకోవడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పిస్తా మొక్క ఆధారిత ప్రోటీన్ కు మంచి మూలం. సుమారు 28 గ్రాముల పిస్తా పప్పులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. శాకాహారులకు పిస్తా ప్రోటీన్ కు మంచి మూలమని చెప్పవచ్చు. అలాగే వీటిలో శరీరానికి అవసరమయ్యే తొమ్మిది రకాల ఆమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. వీటిలో మెగ్నీషియం కూడా మంచి పరిమాణంలో ఉంటుంది. గుండె స్పందనను నియంత్రించడంలో, కండరాలకు విశ్రాంతి ఇవ్వడంలో, నరాల పనితీరును మెరుగుపరచడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. అలాగే నిద్రించే ముందు వీటిని తీసుకోవడం వల్ల వీటిలో ఉండే మెగ్నీషియం కారణంగా మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా పిస్తాను తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. పిస్తాలను స్కిన్నీ నట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకనగా ఇతర గింజలతో పోలిస్తే వీటిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. వాల్నట్స్, మకాడామియా వంటి నట్స్ తో పోలిస్తే అదే క్యాలరీలతో వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు.
పిస్తాలో ఉండే ఫైబర్ వల్ల ఎక్కువ సమయం ఆకలి అవ్వకుండా ఉంటుంది. దీంతో బరువు కూడా తగ్గవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో కూడా ఇవి సహాయపడతాయి. పిస్తాలో ల్యూటిన్, జియాక్సాంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వయసు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యల నుండి రక్షించడంలో దోహదపడతాయి. పిస్తాను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి పెరిగి రక్తహీనత తగ్గుతుంది. వీటిలో జింక్, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి సహాయపడతాయి. చర్మ సంరక్షణలో కూడా పిస్తా దోహదపడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి.
ఇలా అనేక రకాలుగా పిస్తా పప్పు ఆరోగ్యానికి మేలు చేస్తుందని, రాత్రి సమయంలో స్నాక్స్ గా తినడానికి ఇవి ఎంతో చక్కగా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే వీటిని రోజుకు 10 నుండి 12 పప్పుల మోతాదులో మాత్రమే తీసుకోవాలి. వీటిని అతిగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉప్పు లేని పిస్తా పప్పులను తీసుకోవడం మంచిది. ఉప్పు ఉన్న పిస్తా పప్పు రక్తపోటు ఉన్న వారికి అంత మంచిది కాదు. అలాగే వీటిలో ఆక్సలైట్స్ ఉంటాయి కనుక మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారు వీటిని మితంగా తీసుకోవడం మంచిది. పిస్తా పప్పును రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని అనేక పోషకాలు అందుతాయని వీటిని క్రమం తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.