Lok Sabha : రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రోజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంది. దీనిపై చర్చ జరగాలి. దీంతో సభ వాడివేడిగా సాగుతుందనుకున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య దీనిపై మాటల యుద్ధం నడుస్తుందనుకున్నారు. కానీ, స్పీకర్ అవిశ్వాసం అంశాన్ని సభలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం పెద్ద సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు.
ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చకు, ఓటింగ్‌కు పట్టుబట్టాల్సిన ప్రతిపక్షం రూట్ మార్చింది. ఉదయం సభ ప్రారంభం కాగానే గల్ఫ్ యుద్ధం, చమురు ధరలు, భారతీయుల తరలింపు వంటి అంశాల్ని లేవనెత్తింది. దీనిపై సభలో ప్రతిపక్ష సభ్యులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఇరాన్ యుద్ధంపై, పెరుగుతున్న చమురు ధరలపై చర్చించాలని, అలాగే ఇరాన్ సహా గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించాలని కోరుతూ సభలో డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మోదీ లొంగిపోయారంటూ కూడా విమర్శలు చేశారు. ఈ అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రతిపక్ష నేతలు ఇలా నినాదాలు చేయడంతో సభా కార్యక్రమాలు సజావుగా సాగలేదు. దీంతో పలుమార్లు సభ వాయిదా పడింది.
చివరకు మధ్యాహ్నం మూడు గంటలకు సభను వాయిదా వేశారు. తిరిగి సభ మంగళవారం ప్రారంభమవుతుందని ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఇరాన్ యుద్ధం మన దేశంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని, ఇప్పటికే స్టాక్ మార్కెట్లు నష్టపోతున్నాయని రాహుల్ అన్నారు. చమురుర ధరలు కూడా పెరుగుతున్నాయని, ఇవన్నీ ప్రజా సమస్యలే అని రాహుల్ వ్యాఖ్యానించారు.