హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇటీవ ల ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకే పడరాని పాట్లు పడాల్సి వస్తున్నది. కొత్తవాళ్లే కా కుండా రెన్యువల్స్‌కూ ఇక్కట్లు తప్పడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. వెరసి ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల ప్రక్రియ మందకొడిగా కొనసాగుతున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ, నిరుపేద విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లు, కాలేజీ ట్యూషన్, మెయింటెనెన్స్ ఫీజులను ఈ పథ కం ద్వారా రీయింబర్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందుకోసం 2008 నుంచి అమలు చేస్తున్న మార్గదర్శకాలకు విరుద్ధంగా నిరుడు ఏప్రిల్‌లో ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అర్హులైన విద్యార్థులకు నేరుగా డీబీటీ విధానంలో చెల్లించాలని నిర్ణయించింది. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం అమలు చేస్తున్న ఏపీబీఎస్ (ఆధార్ పేమెంట్ బ్రిడ్జి సిస్టమ్) మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని అన్నివరా్గల విద్యార్థులకు ఏకీకృత విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రధానం గా విద్యార్థి అడ్మిషన్ తీసుకున్న వెంటనే ఈపాస్‌లో నమోదు చేసుకోవాలి.
ఆధార్, బయోమెట్రిక్ ధ్రువీకరణ, బ్యాంక్ ఖాతా, కోర్సు వి వరాలు ఎంటర్ చేసుకోవాలి. అంతేకాకుండా బ్యాంక్ ఖాతా, ఐఎఫ్ఎస్సీ, ఖాతాదారు పే రును నేషనల్ పేమేంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇం డియా (ఎన్పీసీఐ) ద్వారా ధ్రువీకరించుకోవాలి. ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్‌ను నేరుగా విద్యార్థి ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా లో జమ చేస్తారు. ఈ నిబంధనలు విద్యార్థులకు కొత్త చిక్కులను తెచ్చిపెడుతున్నాయి.
ఆధార్ సీడెడ్ అకౌంట్లకు సాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో విద్యార్థులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. గ్రామీణ విద్యార్థులకు ఆధార్ సీడింగ్ పెనుశాపంగా మారింది. ఉదాహరణకు ఓ విద్యార్థి గతంలో తన ఆధార్‌ను యూకో బ్యాంక్ ఖాతాకు అనుసంధానించుకుని, రెండేండ్ల క్రితమే ఆ బ్యాంకు ఖాతాను రద్దు చేసుకున్నాడు. ప్రస్తుతం వేరే బ్యాంక్‌లో ఖాతాను కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఆ విద్యార్థి ఆధార్‌తో ఈపాస్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే రద్దయిన పూర్వ యూకో బ్యాంకు అకౌంట్‌నే చూపుతున్నది. దీంతో ఆ విద్యార్థి క్లాసులను వదిలిపెట్టి బ్యాంక్ చుట్టూ, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి వస్తున్నది.
అయినప్పటికీ ఆ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వేలమంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ సీడ్ అయిన బ్యాంక్ అకౌంట్లు ప్రస్తుతం మనుగడలో లేక ఇక్కట్ల పాలవుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారే కాకుండాసెకండియర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులు సైతం తమ స్కాలర్‌షిప్‌ల రెన్యువల్ కోసం తంటాలు పడుతున్నారు. వీరు గతంలో దరఖాస్తు చేసుకునేప్పుడు సమర్పించిన అకౌంట్లను ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు.
అవి ఆధార్తోఅనుసంధానం కాకపోవడమే ఇందుకు కారణం. దీంతో ప్రభుత్వ తీరుపై విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కోతలు విధించేందుకే ప్రభుత్వం ఇలాంటి నిబంధనలను ప్రవేశపెట్టిందని, టాప్ ఇంజినీరింగ్ కాలేజీల ఒత్తిడితోనే ఈ నిబంధనలను తీసుకొచ్చిందని మండిపడుతున్నారు. ఇకనైనా ఆధార్ సీడింగ్, ఈపాస్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుత విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో ఇప్పటికే పలు కోర్సుల్లో ప్రవేశాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు సహా అన్ని వర్గాల విద్యార్థుల నుంచి ఈపాస్ ద్వారా కేవలం 2.79 లక్షల దరఖాస్తులే వచ్చాయి. గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా ఈ దరఖాస్తులు రావడంపై అధికారులే విస్తుపోతున్నారు. వాస్తవానికి ఏటా వివిధ కోర్సుల్లో రెన్యువల్స్ కోసమే 8 లక్షలకుపైగా దరాఖాస్తులు వస్తుంటాయని, కొత్త వచ్చే దరఖాస్తులు మరో 4 లక్షల వరకు ఉంటాయని చెప్తున్నారు. కానీ, ఈ ఏడాది ఇప్పటివరకు రెండూ కలిపి ఈపాస్ ద్వారా కేవలం 2.79 లక్షల దరఖాస్తులే వచ్చాయని, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. దరఖాస్తు ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని స్పష్టమవుతున్నది.