Meta : చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌పై ప్రభుత్వానికి సమాచారం అందిచేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా అంగీకారం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చిన్న పిల్లల విషయంలో ఆన్లైన్ సేఫ్టీ అనేది సోషల్ మీడియా సంస్థల ప్రాథమిక సూత్రం అని, ఇండియా కేంద్రంగా పని చేసే ప్రతి సోషల్ మీడియా సంస్థ దీన్ని పాటించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తమ ప్లాట్‌ఫాంలపై చైల్డ్ అబ్యూజ్, సెక్సువల్ కంటెంట్‌ను నియంత్రించలేని సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పిల్లలకు సంబంధించి ఆన్లైన్ యాక్టివిటీ, కంటెంట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆన్లైన్లో మైనర్ల భద్రతకు తమ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇలాంటి కంటెంట్ విషయంలో సోషల్ మీడియా సంస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, వెంటనే తొలగించాలని ఆయా సంస్థల్ని ఆదేశించింది. దీంతో చైల్డ్ అబ్యూజ్ కంటెంట్‌ను గుర్తించి, తొలగించి, వాటిపై చట్టబద్ధ సంస్థలకు సమాచారం అందిస్తామని మెటా ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.
ఈ విషయంలో ఇది మొదటి అడుగు అని ప్రభుత్వం వివరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఎలాంటి వేధింపులు, అభ్యంతరకర కంటెంట్ ఉండకుండా, సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా కొద్ది రోజుల క్రితం మెటాకు ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసింది. చివరకు తమ తప్పుపై మెటా ఇటీవల క్షమాపణలు కూడా చెప్పింది. మెటాకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఉన్న సంగతి తెలిసిందే.