జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని కేటీకే 5ఏ గనిలో గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఏరియాలోని కేటీకే 5ఏ గనిలో పీ షిప్టులో ఉదయం గని మెయిన్ ఇైంక్లెన్ 2వ లెవల్లో కార్మికులు పాత గడ్డర్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి కొత్తది ఏర్పాటు చేసి వెళ్లిపోయారు.ఈ క్రమంలో నిప్పు రవ్వలు బొగ్గు పొరల్లోకి వెళ్లింది. కార్మికులు అది గమనించకుండా వెళ్లిపోవడంతో క్రమక్రమంగా బొగ్గు పొరల్లో నిప్పు రాజేసుకుంది. సుమారు నాలుగు గంటల తరువాత గనిలో పొగ, మంటలు రావడంతో అటుగా వెళ్లిన ఓ ట్రామర్ కార్మికుడు చూసి అధికారులకు సమాచారం అందించాడు.
అప్పటికే అక్కడ విధులు నిర్వర్తి స్తున్న రంజిత్‌కుమార్, అన్వేశ్, రఘు, క్రాంతి పొగకు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. కాగా, క్రాంతి ఆచూకీ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. సుమారు గంట తర్వాత గనిలోని ఫోన్‌కు క్రాంతి స్పందించారు. మ్యాన్ రైడింగ్ ద్వారా గనిపైకి చేరుకున్నాడు. వెంటనే వారిని ఏరియా సింగరేణి ఆసుప త్రికి తరలించి చికిత్స అందించారు. ఎలాంటి ప్రాణాపాయం జరుగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది గనిలోకి దిగి మంటలు ఆర్పడంతో భారీ ప్రమాదం తప్పింది. సిం గరేణి రెస్క్యూ సిబ్బంది సైతం గనిలోకి దిగి విషవాయువులు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టి పరి స్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో రెండవ షిప్టులో అధికారులు బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు.
గనిలో బొగ్గుకు నిప్పంటుకొని మంటలు రావడం, గని మొత్తం పొగతో నిండిపోవడం ఏరియా గనుల్లో ఇదే ప్రథమం. గనిలో కార్మికులు పూర్తి స్థాయిలో విధుల్లో నిమగ్నమై ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. మొదటి షిప్టు ముగించుకొని కార్మికులందరూ గనిపైకి చేరడంతో భారీ ప్రమాదం తప్పిం ది. సింగరేణి సంస్థలో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. సుమారు పదేళ్ల క్రితం ఆర్కే 7 లో ఇలాంటి ఘటన జరుగగా కార్మికులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.