Secretariat | హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం ఉద్యోగులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గుక్కెడు నీళ్ల కోసం ఉద్యోగులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం రక్షిత మంచినీటిని సరఫరా చేయాల్సింది పోయి.. నీటిని సరఫరా చేయలేక చేతులెత్తేసింది. చివరకు ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి వాటర్ క్యాన్స్ను కొనుగోలు చేస్తున్నారు ఉన్నతాధికారులు.
తెలంగాణ సచివాలయంలో ఏడాది క్రితం వాటర్ ప్యూరిఫైయర్లు పాడైపోయాయి. ప్రైవేటు వ్యక్తుల నుండి వాటర్ క్యాన్స్ను అధికారులు కొనుగోలు చేస్తున్నారు. సచివాలయంలో వాటర్ క్యాన్స్ డబ్బుల కోసం ఉద్యోగుల నుండి నెలకు రూ. 300 నుండి రూ. 400 వరకు సెక్షన్ ఆఫీసర్లు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నుండి వస్తున్న మెయింటైనెన్స్ డబ్బులు ఏం చేస్తున్నారని ఉద్యోగులు సెక్షన్ ఆఫీసర్లను నిలదీస్తున్నారు.
వాటర్ క్యాన్స్ కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం నుండి బిల్లులు వసూలు చేస్తున్నా కూడా తమ నుండి డబ్బులు వసూలు చేయడంపై సచివాలయం ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.