Rajagopal Reddy | తాను ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోవడం లేదని, కొందరు కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) చెప్పారు. ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనడానికి ఏపీలోని గుంటూరు వెళ్లిన ఆయన, శుక్రవారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇక్కడికి బయలుదేరినప్పటి నుంచి రాజకీయంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేను నిన్ననే మీడియా ముందు క్లారిటీ ఇచ్చాను. కొంతమంది కావాలని నా ప్రతిష్టను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని ఎవరూ నమ్మొద్దు. తాను ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు అండగా ఉండే కార్యక్రమాలు చేపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని, ఇరు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండి అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు.