ఖమ్మం రూరల్: గత నెల రోజులుగా ఖమ్మం రూరల్ (Khammam Rural) మండల వ్యాప్తంగా యూరియా కొరత సమస్య రైతులను వెంటాడుతూనే ఉంది. దీంతో అష్ట కష్టాలు పడుకుంటూ రైతులు సాగు చేసిన పంట పొలాన్ని కాపాడుకుంటున్నారు. వారం రోజుల నుంచి కేంద్రాలకు యూరియా సరఫరా పూర్తిగా ఆగిపోయింది. ఎట్టకేలకు శుక్రవారం ఉదయం ఏదులాపురం సహకార సంఘం, టేకులపల్లి సహకార సంఘం పరిధిలో ఏర్పాటుచేసిన ఆయా సబ్ సెంటర్లకు యూరియా వచ్చింది. దీంతో ఎరువుల పంపిణీని అధికారులు ప్రారంభించారు. దీంతో వారం రోజుల క్రితం టోకెన్లు పొందిన వారితోపాటు, కొత్తగా టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో రైతులు తెల్లవారుజాము నుంచే ఆయా సెంటర్లకు చేరుకున్నారు.
ఖమ్మం రూరల్ మండల పరిధిలో గుడిమల్ల, మద్దులపల్లి, తల్లంపాడు, పల్లెగూడెం, ముత్తగూడెం, ఎం వెంకటయ్య పాలెం, తీర్థాల కస్మాతాండాలో అధికారులు సబ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ సెంటర్లకు 200 నుంచి 400 వరకు యూరియా కట్టలు దిగుమతి అయ్యాయని తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున కేంద్రాలకు తరలివచ్చారు. ఎం వెంకటయ్య పాలెంలో ఏర్పాటు చేసిన సెంటర్ పరిధిలో మూడు గ్రామాల రైతులు ఉండడంతో పెద్ద ఎత్తున వచ్చారు. అయితే వారం రోజుల క్రితం టోకెన్లు పొందిన వారికి మాత్రమే యూరియా పంపిణీ జరుగుతుందని అధికారులు చెప్పడంతో క్యూ లైన్లో నిలబడిన రైతులు నిరాశతో వెనుదిరిగారు. మిగిలిన సెంటర్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం మక్క, వరి పంటలు పొట్ట దశలోకి రావడంతో సరిపడా యూరియా పిచికారి చేస్తేనే వెన్నుకు బలం ఉంటుందన్న ఉద్దేశంతో రైతులు ఎరువుల కోసం బారులు తీరారు. శనివారం నుంచి నిరంతరాయంగా యూరియా పంపిణీ చేస్తామని అధికారులు పదేపదే చెప్పినప్పటికీ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ గోడౌన్ పల్లెగూడెం వద్ద టెంటు, తాగడానికి నీరు వంటి వసతులు ఏర్పాటు చేయకపోవడంతో యూరియా కోసం వచ్చిన రైతులు చెట్ల కింద, చెట్లపొదల్లో కూర్చొని సేద తీరుతున్నారు. ఒక్కో సెంటర్లో ఒక్క విధంగా యూరియా పంపిణీ చేపట్టడంతో ఎలాంటి నిబంధనలు పాటించాలో అర్థం కావడం లేదని రైతులు వాపోయారు.