హైదరాబాద్ : తెలంగాణలో అంతర్జాతీయ సంస్థల నుంచి భారీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. తాజాగా కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్ జీనోమ్ వ్యాలీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.740కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. కెనడాకు చెందిన సంస్థ సుమారు 10 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ల్యాబ్ స్పేస్‌లో ఈ పెట్టుబడిని వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో.. ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్ ఇండియా ఎండీ చాణక్య చక్రవర్తి, సంస్థ సీనియర్ ప్రతినిధులు శిల్పి చౌదరి, హరే కృష్ణ, సంకేత్ సిన్హా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తమ సంస్థ జీనోమ్ వ్యాలీలో ఉన్న ఎంయన్ పార్క్‌లో పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ మంత్రికి తెలిపింది. కెనెడియన్ ఫండ్ దక్షిణాసియాలో లైఫ్ సైన్సెస్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి అని కంపెనీ పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు ఇవాన్ హో కేంబ్రిడ్జ్ భారీ పెట్టుబడి లైఫ్ సైన్సెస్ రంగ మౌలిక వసతుల కల్పనలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. భారతదేశం అతిపెద్ద లైఫ్ సైన్సెస్ రంగ పరిశోధన, అభివృద్ధి క్లస్టర్ అయిన జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే 200కుపైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. తాజాగా ఈ పెట్టుబడి ద్వారా ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగంపై దృష్టికి ఊతమిస్తుందన్నారు. పెట్టుబడులతో జీనోమ్ వ్యాలీలో మరింత లాబొరేటరీ స్పేస్ పెరగడంతో పాటు పరిశోధన, అభివృద్ధి, లైఫ్ సైన్సెస్ అనుబంధ రంగాల మౌలిక వసతులు రానున్న కాలంలో మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కంపెనీకి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందిస్తామని కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. జీనోమ్ వ్యాలీలో ఉన్న ఎంయన్ పార్క్‌లో తమ సంస్థ పెడుతున్న 100 మిలియన్ డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్‌తో పాటు భారత ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందన్న నమ్మకాన్ని కంపెనీ ఎండీ చాణక్య చక్రవర్తి వ్యక్తం చేశారు. వర్చువల్ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
This transaction is one of the first such transaction by a pension fund in life sciences real estate segment in South Asia & a benchmark for the sector in India
— KTR (@KTRTRS) July 7, 2021
An investment of this nature in #Hyderabad reinforces the leadership position in the life sciences sector
Delighted to announce the entry of Ivanhoe Cambridge, Canada in Genome Valley through MN park with an investment of USD 100 Mn for creation of about 1 Mn sft lab-space
— KTR (@KTRTRS) July 7, 2021
#HappeningHyderabad pic.twitter.com/ZqgbM67tbc