సిద్దిపేట, మార్చి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): “సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ప్రాణా ంతకంగా మారిన ఇథనాల్ ఫ్యాక్టరీలు మూతపడేవర కు పోరాటం కొనసాగిద్దాం. గుగ్గిళ్ల, నర్సింలుపల్లె గ్రామాల పరిధిలో ఏర్పాటు చేసిన రెండు ఇథనాల్ పరిశ్రమలతో ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. ఇది రాజకీయం కాదు ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం… అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి ముందుకు రావాలి” అని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’తో ఆయన మాట్లాడారు.
ఇప్పుడు ఇథనాల్ పరిశ్రమలను ఆపకపోతే భవిష్యత్ తరాలకు మనం నష్టం చేసిన వారమవుతామన్నారు. ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా గుగ్గిళ్ల.. నర్సింలుపల్లె గ్రామాలకు చెందిన ప్రజలు పోరాడుతున్నారన్నారు. కోర్టుల్లో కేసులు కూడా వేశారు, వారి పోరాటానికి అండగా ఉందామన్నారు. ఆ రెండు ఇథనాల్ పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషవాయువులు బెజ్జంకి మండల ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నాయన్నారు. మహబూబ్నగర్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటును అకడి ప్రజలు తిరసరించి తిప్పికొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ సహకారంతో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించారని ఆరోపించారు.
గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే సత్యనారాయణ తాను గెలిస్తే ఫ్యాక్టరీ ఏర్పాటు చేయిస్తానని చెప్పి పరిశ్రమ యాజమాన్యం వద్ద డబ్బులు తెచ్చుకున్నాడని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే వారికి అండగా ఉండి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించడంతోపాటు ఉత్పత్తిని ప్రారంభించారన్నారు. ఇథనాల్ పరిశ్రమల యాజమాన్యంతో లోపాయికారి ఒప్పందం చేసికొని బెజ్జంకి ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టాడని ఆరోపించారు. ఈ ప్రాంతానికి కేసీఆర్ తెచ్చిన గోదావరి జలాలతో ఇప్పుడిప్పుడే బెజ్జంకి మండల రైతులు పంటలు పండించుకొని జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ఇథనాల్ పరిశ్రమల వల్ల వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రియల్ వ్యాపారం పడిపోయిందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పై ఆధారపడి జీవించేవారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా ఇథనాల్ ఫ్యాక్టరీలు
రెండు ఇథనాల్ ఫ్యాక్టరీలు ఎమ్మెల్యే, అధికారపార్టీ నాయకులకు ఏటీఎంలుగా మారిపోయాయని రసమయి బాలకిషన్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు తమకు ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటే అప్పుడు వెళ్లి తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ వారికి కొమ్ముకాస్తున్నాడని, గ్రామాల్లో దేవాలయాల నిర్మాణాలకు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దుస్తుల కోసం ఫ్యాక్టరీల నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారన్నారు. కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా అందుకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఫ్యాక్టరీల నుంచి డబ్బు తెచ్చుకోవాలంటే ప్రజల శవాల మీద ప్యాలాలు ఏరుకోవడమేనన్నారు.
ఎమ్మెల్యే సత్యనారాయణకు అభివృద్ధి చేయడం ఎలాగుచేత కాదు.. అభివృద్ధికి ఒక రూపాయి కూడా ప్రభుత్వం నుంచి మంజూరు చేయించలేదన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు ఫ్యాక్టరీల నుంచి కోటి రూపాయలు తీసుకువచ్చి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు పంచారని ఆరోపించారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా డబ్బులు వసూలు చేశారన్నారు. మరో రెండున్నరేండ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మానకొండూరు ఎమ్మెల్యేగా తాను మళ్లీ గెలుస్తా .. ఇథనాల్ పరిశ్రమలను మూసివేయిస్తానని రసమయి బాలకిషన్ చెప్పారు.