Supreme Court : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) తోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (National Capital Region – NCR) నుంచి వీధి కుక్కులను తరలించాలని, స్టెరిలైజ్ చేసి ప్రత్యేక షెల్టర్లలో వాటిని ఉంచాలని.. ఆయా ప్రాంతాల్లోని పరిపాలన యంత్రాంగాలను సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీశాయి.
సుప్రీంకోర్టు ఆదేశాలు అమానవీయంగా ఉన్నాయని జంతు ప్రేమికులు విమర్శిస్తుండగా.. ఇతరులు మాత్రం ఆ ఆదేశాలను స్వాగతిస్తున్నారు. వివిధ కుక్కకాటు ఘటనలు, జరిగిన ప్రాణ నష్టం గురించి వారు గుర్తుచేస్తున్నారు. ఈ తీవ్ర చర్చలో నుంచి ఓ కీలక ప్రశ్న పుట్టుకొచ్చింది. వీధి కుక్కలు అన్నింటినీ ప్రత్యేక షెల్టర్లకు తరలించాలి సరే.. మరె ఆ షెల్టర్లు ఎక్కడ ఉన్నాయి..? షెల్టర్లు లేకుండా సుప్రీంకోర్టు ఆదేశాల అమలు సాధ్యమా..? అన్నది ప్రశ్న.
ఢిల్లీలో, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో లక్షల సంఖ్యలో కుక్కలు ఉన్నాయి. కానీ వాటికి సరిపడా షెల్టర్లు లేవు. సరిపడా షెల్టర్ నిర్మించాలంటే ముందుగా కోట్ల రూపాయల్లో నిధులు కావాలి. తగినంత సమయం కావాలి. అదేవిధంగా సరిపడా మ్యాన్ పవర్ లేకపోవడం, కుక్కలను తీసుకెళ్లకుండా స్థానికుల నుంచి వ్యతిరేకత తదితర అంశాలు కూడా సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు అవరోధంగా ఉన్నాయి.
2009 కుక్కల జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో 5.6 లక్షలుగా ఉంది. అప్పటి నుంచి కుక్కల జనాభాను లెక్కించలేదు. అయితే 16 ఏళ్ల కాలంలో కుక్కల సంఖ్య రెట్టింపు అయ్యింది అనుకుంటే ప్రస్తుతం అక్కడ కుక్కల సంఖ్య 10 లక్షలకుపైనే ఉంటుంది. ఆ లెక్క ప్రకారం ప్రతి 500 కుక్కలకు ఒక షెల్టర్ నిర్మించాలన్నా మొత్తం 2 వేల షెల్టర్ల అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో కేవలం 20 షెల్టర్లు మాత్రమే ఉన్నాయి.
ఈ షెల్టర్లు కుక్కలను పట్టుకొచ్చి స్టెరిలైజ్ చేసి విడిచిపెట్టడానికి మాత్రమే సరిపోతాయి. కానీ కుక్కలకు శాశ్వత ఆశ్రయం కల్పించడం సాధ్యం కాదు. ఒకవేళ ఇప్పుడున్న షెల్టర్‌లనే శాశ్వత షెల్టర్లుగా మార్చినా 5 వేల కుక్కలకు మించి ఆశ్రయం ఇవ్వడం సాధ్యపడదు. అంటే పూర్తి లక్ష్యంలో కేవలం 5 శాతం మాత్రమే నెరవేరుతుంది. కుక్కలకు షెల్టర్లు నిర్మించడమనేది సవాలక్ష సమస్యల్లో ఒక్కటి మాత్రమే. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి.
కుక్కులను పట్టడం, వాటికి ఆహారం అందించడం కూడా ప్రధాన సమస్యలే. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ దగ్గర కుక్కలను పట్టేందుకు ప్రస్తుతం ఒక్కో జోన్‌కు కేవలం 2 నుంచి 3 వ్యాన్లు మాత్రమే ఉన్నాయి. కుక్కలను పట్టేవాళ్లలో సుశిక్షితులు లేరు. కాబట్టి నివాస ప్రాంతాల్లో కుక్కలను రౌండప్ చేసి పట్టి తీసుకురావడం అనేది చెప్పినంత సులభం కాదు. అంతేగాక పలు ప్రాంతాల్లో జంతు ప్రేమికులు కూడా అడ్డు తగిలే అవకాశం ఉంది.
అదేవిధంగా లక్షల కుక్కలను షెల్టర్లకు తరలించగలిగినా అన్ని కుక్కలకు రోజూ ఆహారం అందించడం అనేది అంత సులువైన పనేమీ కాదు. అందుకు ప్రతి ఏడాదికి వందల కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయి. అంతేగాక ఆ కుక్కల సంరక్షణ కోసం యానిమల్ అంబులెన్స్‌లు, వెటర్నరీ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అవసరం అవుతారు. పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాల అవసరం ఏర్పడుతుంది. అందుకు కూడా కోట్లల్లో నిధులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల అమలు అంత సులువేమీ కాదనే మాట ఎక్కువగా వినపడుతోంది.