Flag sales : భారత త్రివర్ణ పతాకాన్ని తయారు చేసే ఏకైక అధీకృత కేంద్రం, సరఫరాదారు అయిన.. కర్ణాటక రాష్ట్రం బెంగేరిలోని ‘కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం (KKGSS)’ జెండా అమ్మకాలలో తీవ్ర తగ్గుదలను ఎదుర్కొంటోంది. ఈ సంవత్సరం కేకేజీఎస్ఎస్ టర్నోవర్ రూ.49 లక్షలకు పడిపోయింది. ఎర్రకోటకు, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు బెంగేరి నుంచే జెండాలను సరఫరా చేసేవారు. అయితే 2022లో భారత జెండా కోడ్‌కు సవరణల తర్వాత ఈ జెండాల తయారీ కేంద్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది.
1957 నవంబర్ 7న వెంకటేష్ మాగడి, శ్రీరంగ కామత్ వంటి గాంధేయ నాయకులు KKGSSను స్థాపించారు. కర్ణాటకవ్యాప్తంగా ఉన్న 58 ఖాదీ, గ్రామీణ పరిశ్రమ సంస్థలను ఏకం చేశారు. మొత్తం 17 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో కుట్టు యూనిట్లు, ఉత్పత్తి సౌకర్యాలు, ఒక టెక్స్టైల్ శిక్షణ కళాశాల ఉన్నాయి. ప్రతి జెండాను 60 కుట్టు యంత్రాలపై చేతితో తయారు చేస్తారు. కఠినమైన BIS ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి జెండాను 18 సార్లు పరీక్షిస్తారు.
2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జరిగిన ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారం తర్వాత సాంప్రదాయ ఖాదీ, పట్టు, ఉన్ని వెర్షన్లతోపాటు పాలిస్టర్ త్రివర్ణాలను అనుమతించడానికి కేంద్ర ప్రభుత్వం జెండా కోడ్‌ను సవరించింది. అప్పటి నుంచి బెంగేరిలో జెండాలు అమ్మకాలు తగ్గిపోయాయి. చౌక ధర, యంత్రాలతో తయారీ కారణంగా పాలిస్టర్ జెండాలు మార్కెట్లో వేగంగా ఆధిపత్యం చేశాయి. దాంతో బెంగేరిలో జెండాల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.
కేకేజీఎస్ఎస్ కార్యదర్శి శివానంద్ మఠపతి మంగళవారం తెలంగాణ టుడేతో మాట్లాడుతూ.. బెంగేరిలో జెండాల అమ్మకాల పతనం గురించి వెల్లడించారు. జమ్ము అండ్ కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రధాన రాష్ట్రాల నుంచి ఆర్డర్లు తగ్గిపోవడంతో అమ్మకాలు పడిపోతున్నాయని చెప్పారు. గత సంవత్సరం అమ్మకాలతో పోల్చుకుంటే ఈ ఏడాది అమ్మకాలు 25 శాతానికి పడిపోయాయని కేకేజీఎస్ఎస్ కార్యదర్శి అన్నారు.
2022–23లో రూ.4.28 కోట్ల అమ్మకాలు జరిగాయని, గత ఏడాది అంటే 2023-24లో అవి రూ.1.80 కోట్లకు తగ్గాయని చెప్పారు. ఇప్పుడు అమ్మకాలు ఇంకా తగ్గిపోయాయని, దాంతో ఇక్కడ పనిచేసే 2,000 మంది మహిళా కార్మికులకు సమయానికి వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని తెలిపారు. అమ్మకాలు లేకుండా తాము జీతాలు చెల్లించలేమని, ముడి పదార్థాలను కొనుగోలు చేయలేమని చెప్పారు. సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వం జెండా కోడ్ సవరణను వెనక్కి తీసుకోవాలని, ఖాదీ జెండాలను మళ్ళీ తప్పనిసరి చేయాలని మఠపతి కోరారు.
గత రెండు సంవత్సరాలుగా అమ్ముడుపోని స్టాక్ పేరుకుపోతోందని జెండా తయారీదారు అన్నపూర్ణ దొడ్డమణి చెప్పారు. ‘మేము గతంలో జూన్ నుంచి ఆగస్టు వరకు తొమ్మిది వేర్వేరు పరిమాణాల్లో జెండాలను తయారు చేయడానికి అదనపు గంటలు పని చేసేవాళ్ళం. ఇప్పుడు ఖాదీ జెండాలకు డిమాండ్ పోయింది. మా ఆదాయం కూడా అలాగే తగ్గిపోయింది’ అని చెప్పారు.
కాగా ఉపాధి కరువవడంతో చాలామంది జెండాల తయారీ కార్మికులు తక్కువ జీతానికి ఖాదీ సంచుల తయారీకి మారారు. ఖాదీ జెండాల ధరలు రూ.250 నుంచి రూ.30,150 మధ్య ఉన్నాయి. 21×14 అడుగుల జెండాలు నరగుండ్ హిల్, JSW సిమెంట్ ప్లాంట్లు వంటి ల్యాండ్‌మార్క్ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు. 3×2 అడుగుల జెండాలు అత్యంత ప్రజాదరణ పొందాయి.
ప్రభుత్వం ఇప్పటికైనా జెండా కోడ్ సవరణను వెనక్కి తీసుకోకపోతే ఖాదీ జెండాల తయారీకి ప్రసిద్ధి చెందిన బెంగేరి యూనిట్ చరిత్రలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని కళాకారులు అంటున్నారు.