Lakshya Sen : భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ (Lakshya Sen) చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు. ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ (All England Championship)లో తిరుగులేని ఆటను కనబరుస్తున్న లక్ష్య సేన్ అద్భుత విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో విక్టర్ లాయ్(Victor Lai)పై అతడు గెలుపొందాడు. హోరాహోరీ పోరులో కండరాలు పట్టేసినా వెనక్కి తగ్గని భారత స్టార్.. పట్టుదలతో ప్రత్యర్ధిని మట్టికరిపించాడు. ఈ మెగా టోర్నీలో సేన్ ఫైనల్ చేరడం ఇది రెండోసారి.
పురుషుల టెన్నిస్‌లో సంచలన విజయాలు సాధిస్తున్న లక్ష్య సేన్ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో అదరగొడుతున్నాడు. 2022లో రన్నరప్‌గా నిలిచిన భారత స్టార్.. ఈసారి టైటిల్ లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. ఆరంభం నుంచి అదిరే ఆటతో సెమీస్‌కు చేరిన అతడు ఉత్కంఠ పోరులో కెనడాకు చెందిన విక్టర్ లాయ్‌ను చిత్తు చేశాడు. గంట 37 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో లక్ష్య సేన్ అత్యుత్తమంగా ఆడాడు.
Lakshya Sen 🇮🇳 and Victor Lai 🇨🇦 give it their all for a spot in the finals.#BWFWorldTour #AllEngland2026 pic.twitter.com/NfCKQpRzJU
— BWF (@bwfmedia) March 7, 2026
పటిష్టమైన డిఫెన్స్, స్ట్రోక్ ప్లేతో తొలి సెట్‌ను 21-16తో గెలుచుకున్న సేన్ ఆ తర్వాత వెనకబడ్డాడు. గొప్పగా పుంజుకున్న కెనడా కుర్రాడు 18-21తో భారత ఆటగాడికి షాకిచ్చాడు. దాంతో.. నిర్ణయాత్మక మూడో సెట్లో సేన్ గొప్పగా ఆడాడు. ప్రత్యర్ధి ఎత్తులను చిత్తు చేస్తూ 21-15తో విక్టర్‌ను ఓడించాడు. తద్వారా రెండోసారి ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టాడు.
ఆదివారం జరిగే టైటిల్ పోరులో అతడు పదకొండో సీడ్, చైనీస్ తైపీ ఆటగాడు లిన్ చున్ యూతో తలపడనున్నాడు. ఇప్పటివరకూ ప్రకాశ్ పదుకొనే, పుల్లెల గోపీచంద్ మాత్రమే ఛాంపియన్లుగా నిలిచిన ఈ టోర్నీలో.. మూడో భారతీయ విజేతగా అవతరించేందుకు లక్ష్య సేన్ సర్వశక్తులు ఒడ్డాల్సిందే.