Jaya Bachchan : అలనాటి ప్రముఖ నటి, సమాజ్వాది పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ (Jaya Bachchan) మరోసారి సహనం కోల్పోయారు. ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిపై జయాబచ్చన్ చిందులు తొక్కారు. అతడిని సీరియస్గా పక్కకు తోసేశారు. ‘ఏం చేస్తున్నావు నువ్వు..? ఏందిది..?’ అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని కాన్స్టిట్యూషన్ క్లబ్ (Constitution Club) ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆ సమయంలో జయాబచ్చన్ పక్కనే ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన పార్టీకి చెందిన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఉన్నారు. జయాబచ్చన్ ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రియాంకా చతుర్వేది చుట్టూ చూసి ముందుకు వెళ్లడం కనిపించింది. ఆమె వెనుకాలే జయాబచ్చన్ కూడా వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి.
#WATCH | Delhi: Samajwadi Party MP Jaya Bachchan scolded a man and pushed him away, while he was trying to take a selfie with her. pic.twitter.com/UxIxwrXSM0
— ANI (@ANI) August 12, 2025
అయితే పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు జయాబచ్చన్ సహనం కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆమె అసహనం వ్యక్తంచేసి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ సందర్భంగా కూడా జయాబచ్చన్ సహనం కోల్పోయారు. తన ప్రసంగానికి అడ్డుతగులుతున్నారని ట్రెజరీ బెంచ్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సమయంలో తన పక్కన కూర్చున్న ప్రియాంకా చతుర్వేది వారించేందుకు ప్రయత్నించగా.. ‘నన్ను ఆపొద్దు ప్రియాంకా’ అంటూ కఠిన స్వరంతో హెచ్చరించారు.
గత ఏడాది జూలై-ఆగస్టులో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆమెను సభకు పరిచయం చేస్తున్న సమయంలో కూడా జయ సహనం కోల్పోయారు. ధన్కడ్ ఆమెను జయా అమితాబ్ బచ్చన్ అని సంబోధించడాన్ని తీవ్రంగా తప్పపట్టారు. తాను ప్రముఖ నటినని, తనకు కావాల్సినంత గుర్తింపు ఉన్నదని, అమితాబ్ పేరుతో కలిపి తనను పరిచయం చేయడం నచ్చలేదని అన్నారు.
అంతటితో ఆగక ‘మీరు నేను ఈ సభలో సహచర సభ్యులం. కాకపోతే మీరు ఛైర్మన్ స్థానంలో కూర్చున్నారు అంతే’ అని వ్యాఖ్యానించారు. ఇతర సందర్భాల్లో కూడా చిన్న విషయాలకే సహనం కోల్పోయిన ఘటనలు చాలా ఉన్నాయి. జయాబచ్చన్ తీరుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.