రాజన్న సిరిసిల్ల, మార్చి 7(నమస్తే తెలంగాణ)/గాంధీచౌక్: రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్‌సింగ్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతన జిల్లా కోర్టు భవనాల సముదాయానికి శనివారం ఆయన వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలో ఐదెకరాల విస్తీర్ణంలో రూ.81.60 కోట్ల వ్యయంతో 12 కోర్టు హాళ్లు, టెన్ ప్లస్ టూ శైలిలో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ.. నూతన కోర్టులో మౌలిక వసతులతోపాటు తగినంత సిబ్బంది ఉండాలని ఆదేశించారు.
కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం లభించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, దివ్యాంగులకు బ్యాటరీ త్రీవీలర్లు పంపిణీ చేశారు. హై కోర్టు న్యాయమూర్తులను జిల్లా కోర్టులు, బార్ అసోసియేషన్, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ, జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తీక్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ నీరజ, కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గితే తదితరులు పాల్గొన్నారు.