న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’(సీజేపీ)గత 37 రోజులుగా నిర్వహిస్తున్న దీక్షను విరమించింది. అనంతరం సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆదివారం ఉదయం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనకు టైఫాయిడ్ సోకడంతో పాటు జ్వరం 101 డిగ్రీలకు చేరడంతో చివరిరోజు నిరసనకారులను వ్యక్తిగతంగా కలువలేకపోయానని, ఇందుకు క్షమించాలని కోరారు.
దేశం కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకూ, మద్దతుదారులకూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విమర్శల వల్లే మరింత మెరుగయ్యామని, ఇది ఆరంభం మాత్రమేనని, సీజేపీ ప్రయాణం ముందుకు సాగుతుందన్నారు. సీజేపీ ముఖ్యప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ ఢిల్లీతో పాటు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్లను ఉపసంహరించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు.