అయోధ్య, జూలై 26 : అయోధ్య రామాలయ విరాళాల చోరీ, విరాళాల లెక్కింపులో జరిగిన అక్రమాలపై విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను యూపీ ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. కొత్త సిట్ బృందానికి ఐజీ కిరణ్ నేతృత్వం వహిస్తారు. ఈ బృందంలో సభ్యులుగా డీఐజీ సోమెన్ వర్మ, అయోధ్య సీనియర్ ఎస్పీ గౌరవ్ గ్రోవర్ ఉంటారు.
అయోధ్య విరాళాల అక్రమ కేసును సీనియర్ పోలీస్ అధికారులతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సుప్రీం కోర్టు.. సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో కొత్త సిట్‌ను ఈ నెల 27లోగా ఏర్పాటు చేయాలని ఆదేశించిన క్రమంలో యూపీ ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. కాగా, విస్తృత స్థాయి ఆర్థిక అవకతవకలు, నిర్మాణ వ్యయాలు, ఆభరణాలు వంటి విలువైన వస్తువుల నిర్వహణను పరిశీలించేందుకు, గత ఐదేండ్లలో ట్రస్ట్ ఖాతాలను తిరిగి ఆడిట్ చేయడం సహా తదుపరి చర్యలు చేపట్టే బాధ్యతను ప్రభుత్వం సిట్‌కి అప్పగించింది.