న్యూఢిల్లీ, జూలై 26: యువతలోని ఒక వర్గాన్ని ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి ‘బొద్దింకలు’ అంటూ చేసిన వ్యాఖ్యలు, సీజేఐ విమర్శలు ఆధారంగా సీజేపీ అనే వ్యంగ్య పార్టీ ఆవిర్భావం, దాని నిరసనల కారణంగా సాక్షాత్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం అందరికి తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలను సందర్భం నుంచి వేరు చేసి వక్రీకరించి చూపించారని సీజేఐ సూర్య కాంత్ అన్నారు. ‘పూర్తిగా సందర్భం నుంచి వేరు చేసి వక్రీకరించి చూపించారు. ఆ కేసులో చర్చనీయాంశం నకిలీ, తప్పుడు డిగ్రీల ఆధారంగా వృత్తిలోకి ప్రవేశించిన న్యాయవాదులకు సంబంధించినది. దేశంలో అలాంటి న్యాయవాదులు సుమారు 28 వేల మంది ఉన్నారని, వారు చెప్పుకుంటున్న విశ్వవిద్యాలయాల నుంచి వారి న్యాయ డిగ్రీలు ఎన్నడూ జారీ కాలేదని నాకు తెలిసింది.’
అని బార్ అండ్ బెంచ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీజేఐ తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలు యువతను ఉద్దేశించి ఎంతమాత్రం కాదని, అయితే తాను చెప్పిన మాటలకు పూర్తి తప్పుగా వక్రీకరించారన్నారు. ఈ నకిలీ న్యాయవాదులు న్యాయవ్యవస్థకు ఎలాంటి సమస్యగా మారుతున్నారన్న దానిపైనే అప్పట్లో చర్చ జరిగిందన్నారు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారో, వ్యవస్థలోకి ఎలా ప్రవేశిస్తున్నారో అన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని తాను వారిని ఉద్దేశించి మాత్రమే ‘బొద్దింకలు’ అంటూ వ్యాఖ్యానించానన్నారు.
జూలై 20న నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలను చూసేందుకు తనకు ఆసక్తి లేదని జూలై 22న సీజేఐ సూర్య కాంత్ వ్యాఖ్యానించారు. దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. దానిపై ఆయన వివరణ ఇచ్చారు. విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనకు సంబంధించి ఏమైనా పిటిషన్లు దాఖలు అయ్యాయా? అని తాను పదేపదే అడిగినప్పటికీ ఎటువంటి పిటిషన్ దాఖలు కాలేదని రిజిస్ట్రీ నుంచి తనకు సమాధానం వచ్చిందని ఆయన చెప్పారు. అయినప్పటికీ ఎవరో వచ్చి ఏదో పిటిషన్ దాఖలైనట్టు, దానిపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉన్నట్టు ప్రస్తావించారు.
అందుకే నేను ‘దయచేసి మీ సమయాన్ని, నా సమయాన్ని వృథా చేయకండి’ అని అన్నాను. ‘వెళ్లి పిటిషన్ దాఖలు చేయండి’ అని నేను సుప్రీం కోర్టులో చెప్ప లేను. ఎందుకంటే నేను అనవసరమైన వ్యాజ్యాలను ఆహ్వానించ లేను. సుప్రీం కోర్టు అందిరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఆ నేపథ్యంలోనే నేను ఆ వ్యాఖ్యలు చేశాను. ఆయన ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు.