న్యూఢిల్లీ, మార్చి 7: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శనివారం మహిళా సాధికారతే లక్ష్యంగా 500 మిలియన్ డాలర్లతో సిండికేటెడ్ సోషల్ టర్మ్ లోన్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఆదివారం (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇచ్చిన ఈ ఆఫర్లో గ్రీన్‌షూ ఆప్షన్ కూడా ఉన్నది. దీంతో రుణగ్రహీత కోరుకున్నైట్టెతే నిర్దేశిత పరిమాణాన్ని మించి రుణ మొత్తాన్ని తీసుకొనే సౌలభ్యం ఉంటుంది. ఇక మహిళల సాధికారత కోసం తెచ్చిన ఈ సామాజిక రుణాల సౌకర్యం.. తమ బ్యాంక్‌కు ఓ మైలురాయిగా ఎస్బీఐ ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నది. సమాజంలో లింగ భేదాన్ని తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామన్న ఎస్బీఐ.. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్డీజీ) 5 (లింగ సమానత్వం, బాలికలు-మహిళల సాధికారత సాధన)కు ఈ టర్మ్ లోన్లు అర్థవంతమైనవిగా అభివర్ణించింది.
అవకాశాలు కల్పిస్తాం: సీఎస్ శెట్టి
మహిళల ఎదుగుదలకు అవకాశాలు కల్పిస్తామని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి అన్నారు. ‘ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ బాధ్యతాయుతమైన సంస్థగా మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని ప్రకటించేందుకు సంతోషిస్తున్నాం’ అని తెలిపారు. ఈ సామాజిక రుణంతో మహిళలు మరింత ఎత్తుకు చేరాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. కాగా, ఆయా బ్యాంకులు ఇప్పటికే మహిళల కోసం ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లను అందిస్తున్న సంగతి విదితమే. వీటిపై అధిక వడ్డీరేట్లను చెల్లిస్తున్నాయి. అలాగే బిజినెస్ లోన్లు, పర్సనల్ లోన్లనూ ఆకర్షణీయ వడ్డీరేట్లకే ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకొస్తున్నారు. అంతేగాక సిబిల్ స్కోర్ బాగుంటే అదనపు ప్రోత్సాహకాలనూ అందిస్తున్న బ్యాంకులున్నాయి.
వేతన సమానత్వం లేదు ; దేశంలోని 33 శాతం మహిళల అభిప్రాయం: నౌకరీ.కామ్
పనిచేసే చోట వేతన సమానత్వం లేదని దేశంలోని 33 శాతం మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మహిళా నిపుణులు ఏం కోరుకుంటున్నారు’ పేరిట నౌకరీ.కామ్ ఓ నివేదికను శనివారం విడుదల చేసింది. దేశంలోని ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న 50,000 మంది మహిళా ఉద్యోగుల అభిప్రాయాలతో ఈ సర్వేను చేపట్టింది. అయితే ఇందులో 67 శాతం మంది పనిచేసే చోట వేతన సమానత్వం ఉన్నదనే విశ్వాసం కనబర్చారు. కానీ 33 శాతం మంది ఇందుకు విరుద్ధంగా స్పందించారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ (42 శాతం), ఎఫ్ఎంసీజీ (38 శాతం), ఫార్మాస్యూటికల్స్-లైఫ్ సైన్సెస్ (38 శాతం), ఆటోమొబైల్స్ (37 శాతం)లో ఉన్న మహిళా ప్రొఫెషనల్స్ వీరిలో ఉన్నారు.
రిటైల్ (35 శాతం), హోటల్స్-రెస్టారెంట్లు (35 శాతం), ఐటీ సేవలు-కన్సల్టింగ్ (34 శాతం), టెలికాం/ఐఎస్పీ (34 శాతం), మెడికల్ సర్వీసెస్/హాస్పిటల్ (33 శాతం), చమురు-గ్యాస్ (33 శాతం) రంగాల్లో పనిచేస్తున్న మహిళలు కూడా వేతనాల్లో పురుషులు తమకంటే మెరుగ్గా ఉన్నట్టు చెప్పడం గమనార్హం. దీంతో మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ రిపోర్టు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. ఇక గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సర్వేలో సమాన వేతనం, మెన్స్ట్రువల్ సెలవుల కోసం డిమాండ్ చేస్తున్న మహిళల సంఖ్య 19 శాతం నుంచి 27 శాతానికి పెరిగినట్టు తేలింది. ఇదిలావుంటే ఈ సర్వేలో పాల్గొన్న మహిళల్లో 50 శాతం మంది పెండ్లి, సంతానానికి సంబంధించిన ప్లాన్లను బహిర్గతపర్చేందుకు ఇష్టపడటం లేదని స్పష్టమైంది. బయటకు చెప్తే పక్షపాత వైఖరిని ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న భయాలే కారణం. విడాకులు తీసుకున్న మహిళలకు ఉద్యోగాలు, ఉద్యోగోన్నతుల్లో చాలా సవాళ్లు ఎదురవుతున్నట్టు కూడా ఈ సర్వే తేటతెల్లం చేసింది.