బచ్చన్నపేట, ఆగస్టు 11: జనగాం జిల్లా బచ్చన్నపేట మండలానికి సాగునీరు అందించే దేవాదుల కాలువను ధ్వంసం చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత గంగం సతీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కాలువను పరిశీలించి మాట్లాడారు.
కన్నెబోయినగూడెం నుంచి గోపరాజుపల్లి మీదుగా బచ్చన్నపేట మండలానికి వస్తున్న దేవాదుల కాలువను కొందరు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసి, కాలువ ద్వారా రావాల్సిన నీటిని మళ్లించారని సతీష్‌రెడ్డి ఆరోపించారు. దీంతో బచ్చన్నపేట మండలానికి చేరాల్సిన దేవాదుల నీటికి ఆటంకం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేవాదుల కాలువ ద్వారా మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందుతున్నదని, ప్రస్తుత వర్షాకాలంలో రైతులకు ఈ నీరు ఎంతో కీలకమని పేర్కొన్నారు. కాలువ ధ్వంసంతో నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడితే రైతులు, గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వానికి చెందిన నీటి వనరులను ధ్వంసం చేసి నీటిని అక్రమంగా మళ్లించడం తీవ్రమైన విషయమని పేర్కొన్నారు. బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన దేవాదుల కాలువకు వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించాలని సతీష్‌రెడ్డి కోరారు. బచ్చన్నపేట మండలానికి రావాల్సిన దేవాదుల నీటిని యథావిధిగా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
దేవాదుల నీరు సక్రమంగా చేరితే మండలంలోని పలు గ్రామాల చెరువులు నిండే అవకాశం ఉందని తెలిపారు. చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరగడంతోపాటు రైతులకు సాగునీటి సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. రైతులు, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.