Elephants : దేశంలోనే ఏనుగుల జనాభా (Elephant population) అత్యధికంగా కలిగిన రాష్ట్రంగా కర్ణాటక (Karnataka) తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ రాష్ట్రంలో అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన చామరాజనగర్ (Chamaraja Nagar) జిల్లా ఏనుగుల సంరక్షణలో అగ్రస్థానంలో ఉంది. ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం (World Elephants day) సందర్భంగా అటవీ అధికారులు ఏనుగుల జనాభాకు సంబంధించి కొత్త అంచనాలను వెల్లడించారు. భూమిపై నివసించే అతిపెద్ద క్షీరదమైన ఏనుగుల సంరక్షణలో చామరాజనగర్ జిల్లా పాత్రను అటవీ అధికారుల తాజా అంచనాలు పతాకస్థాయిలో నిలబెట్టాయి.
రాష్ట్రంలో అతిపెద్ద అటవీ విస్తీర్ణం కలిగిన చామరాజనగర్ జిల్లాలో బందీపూర్, బిలిగిరి రంగనాథస్వామి ఆలయం (BRT) అనే రెండు పులుల అభయారణ్యాలు ఉన్నాయి. అదేవిధంగా మలై మహాదేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం, కావేరి వన్యప్రాణుల అభయారణ్యం అనే రెండు ప్రధాన వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతం ఆ జిల్లాను పులులు, ఏనుగులకు సహజ స్వర్గధామంగా మార్చింది.
2023 ఏనుగుల జనాభా లెక్కల ప్రకారం.. కర్ణాటకలో మొత్తం 6,395 ఏనుగులు ఉన్నాయి. వాటిలో కేవలం చామరాజనగర్ జిల్లాలోనే 2,500 కంటే ఎక్కువ ఏనుగులు ఉన్నట్లు తేలింది. అందులో బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో 1,116 ఏనుగులు, బీఆర్టీ టైగర్ రిజర్వ్‌లో 619 ఏనుగులుండగా.. మలై మహదేశ్వర వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో 706, కావేరి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో 236 ఏనుగులు ఉన్నాయి.
గడిచిన రెండేళ్లలో కర్ణాటకలో ఏనుగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం.. బందీపూర్ ఏనుగుల జనాభా 1,500 కంటే ఎక్కువగా ఉంది. అయితే మహదేశ్వర, కావేరి, బీఆర్టీ కలిపి 1,800 ఏనుగులు ఉన్నట్లు విశ్వసిస్తున్నారు. 2025 ఏడాదికి సంబంధించిన ఏనుగుల జనాభా లెక్కల నివేదిక ఇంకా వెల్లడి కానప్పటికీ.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిశీలనలు రాష్ట్రవ్యాప్తంగా ఏనుగుల సంఖ్యలో ఆరోగ్యకరమైన పెరుగుదల ధోరణిని సూచిస్తున్నాయి.
నిరంతర పరిరక్షణ ప్రయత్నాలు, స్థానిక సమాజాలతో బలమైన భాగస్వామ్యం కారణంగా ఏనుగుల జనాభా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మానవ-ఏనుగుల సంఘర్షణను తగ్గించడానికి చర్యలు.. అంటే సౌరశక్తితో పనిచేసే కంచెల ఏర్పాటు, ఏనుగులను జనావాసాల్లోకి రాకుండా కందకాల ఏర్పాటు, రైల్వే బారికేడ్ల నిర్మాణం లాంటివి ఏనుగులను, జనావాసాలను రక్షించడంలో కీలకపాత్ర పోషించాయని అంటున్నారు.
ఈ చర్యలు ఏనుగులు జనావాసాల్లోకి చొరబడటాన్ని తగ్గించాయని, మందలు అటవీ కారిడార్లలో స్వేచ్ఛగా సంచరించడానికి వీలు కల్పించాయని అధికారులు చెబుతున్నారు.