KTR : కేంద్రమంత్రి బండి సంజయ్‌కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించారు. ఫోన్ల ట్యాపింగ్ కేసులో అసత్యాలు మాట్లాడినందుకు నోటీస్ పంపినట్లు తెలిపారు. బండి సంజయ్ కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ప్రజాప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదంటూ నోటీసులలో పేర్కొన్నారు.
బండి సంజయ్ తన రాజకీయ ఉనికి కోసమే అసత్యపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసత్య ఆరోపణలు చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులలో డిమాండ్ చేశారు. భవిష్యత్‌లోనూ అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని పేర్కొన్నారు. లేదంటే క్రిమినల్ చర్యలకు కూడా బాధ్యులు కావాల్సి వస్తుందని హెచ్చరించారు.
అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంపై బండి సంజయ్ చేసిన ఆరోపణలను కేటీఆర్ ఆయనకు లీగల్ నోటీస్‌లు పంపకముందే తిప్పికొట్టారు. బాధ్యాతయుతమైన కేంద్రమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిల్లరగా, దిగజారి మాట్లాడటం సరికాదన్నారు. దమ్ముంటే ఆరోపణల్లో ఒక్క శాతం నిజమున్నా నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే ఆరోపణలను ఉపసంహరించుకొని 48 గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. లీగల్ నోటీసులు పంపిస్తున్నానని, 48 గంటల్లో స్పందించకుంటే కోర్టుకు ఈడుస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
సున్నితమైన అంశంపై సంజయ్ హద్దు మీరి మాట్లాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కనీసం కామన్ సెన్స్ లేకుండా, వాస్తవాలను తెలుసుకోకుండా, అసంబద్ధమైన, దిగజారుడు, థర్డ్‌క్లాస్ స్థాయిలో చిల్లర కామెంట్లు చేయడం ఆయనకు రివాజుగా మారిందని నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో చవకబారు పబ్లిసిటీ కోసం, మీడియా దృష్టిని ఆకర్షించేందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత సున్నితమైందో, చట్టపరంగా ఎంత కఠినమైందో సంజయ్‌కి తెలియకపోవడం విడ్డూరమని, కేంద్రమంత్రిగా ఉన్న సంజయ్‌కి నిఘా వ్యవస్థల పనితీరు, విధానాలపై కనీస అవగాహన, పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం దురదృష్టకరమని ఎద్దేవాచేశారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సంజయ్..ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని, సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడం ఆయన రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రమంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ బాసులకు చెప్పులు మోసేంత ఈజీ కాదనే విషయం గ్రహించాలని దెప్పిపొడిచారు. ఫోన్ ట్యాపింగ్‌పై సంజయ్ మాట్లాడిన ప్రతిసారీ దిగజారుతున్నారని, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. మీడియాలో ఛీప్ పబ్లిసిటీ కోసం వీధి నాటకాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.